AP

దైవ నామాలను అపహాస్యం చేయొద్దు: పవన్ కల్యాణ్..

దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నామాలను కించపరచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటనను ఆయన ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ రాజకీయ పార్టీ, తమ కార్యక్రమాల్లో పవిత్రమైన గోవింద నామాలను పేరడీగా వాడుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం అపహాస్యం చేయడమే కాదని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రపూరిత ఆలోచన అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసాలతో ముడిపడిన అంశాలను చులకన చేసే ఇలాంటి చర్యలను సహించకూడదని స్పష్టం చేశారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరూ కూడా దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలను అపహాస్యం చేసేందుకు వినియోగించవద్దని ఆయన హితవు పలికారు. భక్తికి సంబంధించిన పవిత్రమైన విషయాలను గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.