AP

ఏపీలో మోగనున్న స్థానిక నగారా.. ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలు..

ఏపీ లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఓటర్ల జాబితాల ప్రచురణకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్టయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 3న ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, గతంలో జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 17న ఓటర్ల జాబితాలను ప్రకటించాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనులను ఎస్‌ఈసీ వేగవంతం చేసింది. ఇటీవల మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల కార్యదర్శులతో కమిషనర్ పునేఠా సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల నిర్వహణలో మొదటి దశ అయిన ఓటర్ల జాబితాల ప్రకటనతో ఈ కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 4,033 డివిజన్లు, వార్డులకు ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు. వీటిలో 17 కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. 2021లో కొన్ని చోట్ల న్యాయస్థానాల్లో కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోగా, ఈసారి అన్నిచోట్లా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు, గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 21 నుంచి 31వ తేదీలోగా రాష్ట్రంలోని 13 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రచురించాలని, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఖరారు చేయాలని ఆదేశించారు. 2026 జనవరి 1వ తేదీని అర్హతగా తీసుకుని తుది ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికలు జరగవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.