National

అది ఓ చారిత్రక రాత్రి..! స్వాతంత్ర్యం ఆగస్టు 15, అర్ధరాత్రే ఎందుకు..?

అది ఓ చారిత్రక రాత్రి.. తెల్లవారితే దేశం మొత్తం స్వేచ్ఛా భారతాన్ని చూడబోతోంది. కానీ స్వాతంత్ర్యం ప్రకటించాల్సిన సమయం దగ్గరపడే కొద్దీ ఓ విచిత్రమైన చర్చ మొదలైంది. ఆగస్టు 15న భారత్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం శుభం కాదని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. తేదీని మార్చే పరిస్థితి లేదు. దీంతో అదే తేదీలో.. ఓ ప్రత్యేక సమయాన్ని ఎంచుకునే ఆలోచన తెరపైకి వచ్చింది. చివరకు అర్ధరాత్రి వేళ భారత్‌ స్వేచ్ఛను అందుకుంది.

మౌంట్‌బాటన్‌ ఖరారు చేసిన ఆగస్టు 15
1947 జూన్‌ 4న లార్డ్‌ మౌంట్‌బాటన్‌ బ్రిటిష్‌ పాలనకు ముగింపు పలికే తేదీని ప్రకటించారు. ఆగస్టు 15న భారత్‌కు అధికార బదలాయింపు జరగాలని నిర్ణయించారు. ఆ తేదీ ఎంపిక వెనుక మౌంట్‌బాటన్‌కు ప్రత్యేక కారణం ఉంది. 1945లో జపాన్‌ లొంగిపోయిన రోజుకు ఆగస్టు 15 రెండో వార్షికోత్సవం. అయితే భారత్‌లో ఆ తేదీపై మరో కోణంలో చర్చ మొదలైంది. 

‘ఆ రోజు మంచిది కాదు’ అన్న జ్యోతిష్యులు
ఆగస్టు 15 శుభదినం కాదని పలువురు జ్యోతిష్యులు భావించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. నాటి కలకత్తా, వారణాసి సహా పలు ప్రాంతాల్లో స్వాతంత్ర్య సమయంపై జాతక లెక్కలు పరిశీలించినట్లు సమాచారం. కొత్త దేశానికి ఆ రోజు అనుకూలంగా లేదని కొందరు హెచ్చరించారు. వరదలు, కరవు, క్షామం, హింస వంటి విపత్తులు రావచ్చని ఓ జ్యోతిష్యుడు మౌంట్‌బాటన్‌కు లేఖ రాసినట్లు ‘ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’లో ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు సంబంధించిన అసలు పత్రం మౌంట్‌బాటన్‌ ఆర్కైవ్స్‌లో ఇప్పటివరకు గుర్తించలేదని సమాచారం. 

తేదీ మార్చడం మాత్రం కుదరదు!
ఇప్పటికే స్వాతంత్ర్య కార్యక్రమాల ఏర్పాట్లు మొదలయ్యాయి. మౌంట్‌బాటన్‌ ప్రకటించిన తేదీని వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. అందుకే తేదీని మార్చడం కంటే సమయాన్ని మార్చే మార్గం గురించి ఆలోచన మొదలైంది. ఆగస్టు 15లోనే అనుకూలమైన ముహూర్తాన్ని వెతకాలని నిర్ణయించినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి నుంచే భారత స్వాతంత్ర్యానికి అర్ధరాత్రి సమయం ఎలా వచ్చిందన్న అసలు కథ మొదలవుతుంది. 

అర్ధరాత్రి ముహూర్తం

జ్యోతిష్య లెక్కల్లో అనుకూల సమయాన్ని ఎంచుకునే ప్రయత్నం జరిగింది. అభిజిత్‌ ముహూర్తం, పుష్య నక్షత్రం వంటి అంశాలపై చర్చ సాగినట్లు పుస్తకాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 15కి మారే అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉంటుందని భావించారు.దీంతో ఆగస్టు 15 తేదీ అలాగే ఉండేలా.. అధికార బదలాయింపు సమయాన్ని అర్ధరాత్రికి మార్చే ఆలోచన ముందుకొచ్చింది. చివరకు ఇదే మార్గం ఆచరణలోకి వచ్చింది. 

నెహ్రూ వేసిన ప్రణాళిక
ఆగస్టు 14న రాజ్యాంగ సభ సమావేశమైంది. సభను రాత్రి వరకు కొనసాగించి.. అర్ధరాత్రి దాటగానే స్వాతంత్ర్య ఘట్టాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అధికారికంగా ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినంగా కొనసాగింది. అదే సమయంలో జ్యోతిష్యులు అనుకూలంగా భావించిన సమయానికి అధికార బదలాయింపు జరిగే అవకాశం ఏర్పడింది. తేదీ విషయంలో మౌంట్‌బాటన్‌ నిర్ణయం.. సమయం విషయంలో భారత నేతల ఆలోచన.. ఇలా రెండూ ఒకే చోట కలిశాయి. 

గడియారం 12 కొట్టగానే.. చరిత్ర మారిపోయింది
1947 ఆగస్టు 14 రాత్రి రాజ్యాంగ సభలో చారిత్రక సమావేశం కొనసాగింది. అర్ధరాత్రి దాటగానే భారత్‌ స్వతంత్ర దేశంగా కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ ప్రసంగం చేశారు. “ప్రపంచం నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి భారత్‌ స్వేచ్ఛలోకి మేల్కొంటుంది” అంటూ ఆయన దేశానికి కొత్త దిశను చూపించారు. అలా ఆగస్టు 15 ఉదయం కంటే ముందే.. అర్ధరాత్రి వేళ స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది.