TELANGANA

బీఆర్ఎస్ చేతబడి చేయిస్తోంది.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు..!

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత ప్రతిపక్షాల మాయలో పడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

ఈ సందర్భంగా కొందరు మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన సీఎం, ఇది కేవలం కాగితం ముక్క కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు అని అన్నారు. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చి స్కామ్‌లు చేస్తే, తాము సన్నబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల పేరుతో గతంలో నాసిరకం పంపిణీ చేస్తే, తాము పాలపిట్ట, చిలకపచ్చ రంగు చీరలతో మహిళల గౌరవం పెంచామని తెలిపారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బాగుపడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోర పూజలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడు ఆలయాల్లో అర్ధరాత్రి చేసిన పూజల రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

తాము మంజూరు చేసిన 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్ వారు కట్టిన డబ్బా ఇళ్ల వద్ద ఓట్లు అడగగలరా? అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. రాహుల్ గాంధీ రాముడైతే, జగ్గారెడ్డి హనుమంతుడని కొనియాడారు. అనంతరం నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు.