ఏపీ శాసనసభలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడింది. రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్-1 అందిస్తుంది. ఎంతో శ్రమించి అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు
గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ – 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. బరితెగించి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం గత పాలనలో చేశారని, ప్రజలు, ఉద్యోగార్ధులు కూడా ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. అసెంబ్లీ జవాబు దారీ తనానికి వేదిక, దీని నుంచే ప్రజలకు వివరాలు చెప్పాలన్నారు. ఈ తరహా అక్రమాలు మళ్లీ పునరావృతంగా కాకుండా సంస్థలో కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.
2019-24 మధ్య విధ్వంసం జరిగిందని చాలాసార్లు చెప్పాను. ప్రజావేదికతో మొదలు పెట్టి రాష్ట్ర బ్రాండ్ వరకూ దెబ్బతీశారన్నారు. ఏపీ ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారు. 2018లో జారీ చేసిన గ్రూప్ – 1 సర్వీసుల నోటిఫికేషన్ విడుదల చేస్తే 1.14 లక్షల మంది దరఖాస్తు చేశారని అన్నారు. ఇందులో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారని అన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగితే జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్టుతో తరలిస్తాంమన్నారు.
అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారుల నియామకాలకు సంబంధించి పరీక్షలు జరిగితే ఇంకెంత భద్రంగా ఉండాలి? కానీ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరించారు. అవకతవకలకు పాల్పడ్డారు. డిజిటల్ ఇవాల్యుయేషన్ పక్కన పెట్టి మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు చెప్పిందన్నారు. అయినా కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అఫిడవిట్లు వేసి బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తించారన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత సరిదిద్దుకోవాల్సింది పోయి హాయ్ లాండ్‌లో ఎవాల్యుయేషన్ కోసం రూ.1.19 కోట్లకు పనులకు ఉత్తర్వులు ఇచ్చారు.
ఓవైపు కోర్టు ఆదేశాలు ఉన్నా ఇంటర్వూలు నిర్వహించి ఉద్యోగాల నియామకాలను కూడా చేసేశారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ప్రైవేటు చేతికి ఎవాల్యుయేషన్ అప్పగించి బరితెగించారన్నారు. ఇతర కేసులో సీఐడీ స్వాధీనంలో ఉన్న హాయ్ లాండ్ లో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. ప్రైవేటు వ్యక్తులను ఎవాల్యుయేటర్లను నియమించారన్నారు. గ్రూప్ 1 అధికారుల రాసిన పరీక్షలను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో ఎవాల్యుయేషన్ చేయించారన్నారు.

