AP

అనకాపల్లి మరో రంగారెడ్డి అవుతుంది.. ఇది ఖాయం.. రాసిపెట్టుకోండి: సీఎం చంద్రబాబు..

ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను సాకారం చేస్తూ, పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి గడ్డపై అడుగుపెట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సాధించిన ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, దాని ఫలితమే ఈ జలయజ్ఞమని అన్నారు.

మాట నిలబెట్టుకున్నాం.. పునర్నిర్మాణం చేస్తున్నాం 

గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తుచేశారు. “ఆ దీవెనల ఫలితమే నేడు అనకాపల్లికి గోదావరమ్మను తీసుకురావడం. మొన్న వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మను మార్కాపురానికి తరలించాం. ఈరోజు పోలవరం ఎడమ కాలవ ద్వారా గోదావరిని అనకాపల్లికి తీసుకొచ్చాం. ఇది ఒక చారిత్రక ఘట్టం” అని ఆయన అన్నారు. 

హెలికాప్టర్‌లో వస్తున్నప్పుడు తూర్పు కనుమలు, అడవులు, వాగులను దాటుకుని తరలివస్తున్న గోదావరి జలాలను చూసి ఎంతో సంతృప్తి కలిగిందని తెలిపారు. “అనకాపల్లి బెల్లం ఎంత తీయగా ఉంటుందో, ఈ రోజు అంతే తీయగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని సీఎం వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే జల ప్రణాళిక

 ఈ జల ప్రవాహం ఇక్కడితో ఆగదని, వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు, ఆ తర్వాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి పాదాల చెంతకు గోదావరి జలాలను తీసుకెళ్లి వంశధార నదికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

“గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ అని పాటల్లో విన్నాం. ఇప్పుడు దానిని నిజం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఈ జల విజయం ప్రజల విజయం,” అని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ ప్రాజెక్టును అనుసంధానించి 12 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. 3,200 కోట్లు ఖర్చు చేస్తామని, 2028 నాటికి వాటిని జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “2019 నాటికి మేము పోలవరం పనులను 72% పూర్తి చేశాం. కానీ తర్వాత వచ్చిన గడ్డలి పార్టీ నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయి ప్రాజెక్టు గోదావరి పాలయ్యే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ. 500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ నాయకుడు, తన నివాసం కోసం రుషికొండలో ప్యాలెస్‌కు రూ. 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవి” అని ఆయన ఆరోపించారు. 

విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని ఇప్పుడు పేటీఎం బ్యాచ్‌తో ప్రచారం చేయిస్తున్నారని, కానీ ఐదు డేటా సెంటర్లకు అవసరమైన దానికంటే వందల రెట్లు ఎక్కువ నీటిని ఇచ్చే శక్తి తమకుందని స్పష్టం చేశారు. భోగాపురం, వెలిగొండలాగే ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను కూడా దొంగిలించేందుకు గత పాలకులు ప్రయత్నిస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దార్శనికత 

“సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు. జలం ఉంటేనే జీవం, జీవితం,” అని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందుతుందని, పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని కేటాయిస్తామని వివరించారు. అదానీ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్, ఫార్మా వంటి పరిశ్రమలతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. 

“ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి ఎలా అభివృద్ధి చెందిందో, రేపు అనకాపల్లి మరో రంగారెడ్డి అవుతుంది. ఉత్తరాంధ్ర నుండి వలసలు పోవడం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు వస్తారు. ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా, ఉన్నతాంధ్రగా మారుతుంది. ఇది ఖాయం, రాసిపెట్టుకోండి” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు పిలుపు.. భవిష్యత్తుకు భరోసా 

గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమ, పురుషోత్తపట్నం ద్వారా నదుల అనుసంధానం చేశానని, ఇప్పుడు అనకాపల్లికి నీరు తెచ్చానని, రాబోయే మూడేళ్లలో రూ. 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. “పాలకులం కాదు, మీకు సేవకులం. పదవి అంటే పెత్తనం కాదు, జవాబుదారితనం. మాకు అహంకారం లేదు, అంకితభావం ఉంది” అని అన్నారు. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’తో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.