TELANGANA

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రాజ్‌నాథ్‌సింగ్, రామ్మోహన్‌నాయుడితో భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్య అతిథిగా సీఎం ఆహ్వానించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భాగమైన డిఫెన్స్ ఎక్స్‌పోలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద ప్రతిపాదించిన డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం పునరుద్ధరణ అంశాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళుతూ.. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని, అవసరమైతే మరో 750 ఎకరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అనంతరం పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సమావేశమైన రేవంత్ రెడ్డి… రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి గడ్డం వివేక్, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, అనిల్ కుమార్ యాదవ్ తదితర నేతలు ఈ భేటీలలో పాల్గొన్నారు.