తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుని, సొంతంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అనే పార్టీ మనుగడలో ఉందంటే దానికి కారణం తానేనని స్పష్టం చేశారు.
తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో కొంతమంది నేతలు తన వద్దకు వచ్చారని కవిత వెల్లడించారు. ఆ ప్రతిపాదన వినగానే తాను తీవ్రంగా వ్యతిరేకించానని, విలీనానికి అస్సలు ఒప్పుకోకుండా స్ట్రాంగ్‌గా నిలబడ్డానని కవిత చెప్పారు.
“నేనేం తప్పు చేయలేదు.. ఏదో ఒకరోజు బెయిల్‌పై కచ్చితంగా బయటకు వస్తాను, అంతవరకు పార్టీని వేరే పార్టీకి త్యాగం చేయవద్దని వారితో చెప్పాను. పార్టీ మనుగడ కోసం జైల్లో నా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను” అని కవిత వివరించారు.
ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చాక కొందరు బీఆర్ఎస్ నేతలు టీవీల్లో కూర్చుని ఏది పడితే అది మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే కారణమంటూ వస్తున్న ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. ఎన్నికల సమయంలో చర్చ అంతా కేవలం ప్రభుత్వ వైఫల్యాల గురించే జరిగిందని, కానీ ఆ చేదు నిజాన్ని అంగీకరించడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. పార్టీలో తాను తీవ్రమైన పక్షపాతాన్ని, అవమానాన్ని చవిచూశానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

