తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కీలక కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
“వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 30వ తేదీన మధిరలో నిర్వహించబోయే ‘రైతు సమ్మేళనం’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను నేరుగా విడుదల చేస్తారు. మార్కెట్ డిమాండ్ మేరకు 7 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది” అని తెలిపారు.
తెలంగాణ నుండి కేంద్రం తక్కువ ధాన్యం సేకరించడం సరికాదని అన్నారు.. ఎరువుల కోటా, రామగుండం యూరియాలో రాష్ట్రానికి సింహభాగం కేటాయింపు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతులు, ఐఆర్ఎఫ్ సీ రుణాల విడుదలపై త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇకపై అంతా డిజిటల్ కేబినెట్ నిర్వహిస్తామన్నారు.

