వాతావరణ మార్పులపై ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంఓ) కీలక హెచ్చరిక చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడుతోందని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు.. ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని తాజా అంచనాలో వెల్లడించింది.
సెప్టెంబర్ 3న విడుదల చేసిన తాజా నివేదికలో డబ్ల్యూఎంవో ఇంతటి అధిక స్థాయి విశ్వాసంతో ఎల్‌నినో కొనసాగింపుపై అంచనా వేయడం ఇదే తొలిసారి. పసిఫిక్ సముద్ర ఉపరితలంతో పాటు లోతైన జలాల్లోనూ అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి ఎల్‌నినో మరింత బలపడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయి.
పసిఫిక్‌లో అసాధారణ వేడి
ఎల్‌నినో అనేది మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియ. దీని ప్రభావం పసిఫిక్ ప్రాంతానికే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరును మార్చగలదు.
ఎల్‌నినోను పర్యవేక్షించే కీలక ప్రాంతమైన నినో 3.4లో మే నుంచి జులై 2026 వరకు సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. జులైలో ఈ తేడా 2 డిగ్రీలకు చేరింది. జులై చివరి నుంచి ఆగస్టు మధ్య వరకు వారపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.2 నుంచి 2.6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యాయి.
సముద్రం అడుగుభాగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. జులై, ఆగస్టు ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 8 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2026 చివరి నాటికి ఎల్‌నినో చాలా బలమైన స్థాయికి చేరుకోవచ్చని డబ్ల్యూఎంఓ అంచనా వేస్తోంది.
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
ఎల్‌నినో ప్రభావం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. అయితే భారత్‌కు ఇది కీలకమైన వాతావరణ సంకేతం. సాధారణంగా ఎల్‌నినో బలపడిన సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడొచ్చు.
భారత్‌లో 2026 నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే ఆందోళనకర అంచనా ఇచ్చింది. మేలో విడుదల చేసిన అంచనాలో సీజన్ మొత్తం వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం 60 శాతంగా అంచనా వేసింది.
ఆ అంచనాలకు అనుగుణంగానే ఆగస్టు ముగిసే నాటికి దేశంలో వర్షపాతం 16 శాతం లోటుగా నమోదైంది.
వేడి, కరవు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు!
ఎల్‌నినో బలపడటంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, కరవు, వరదల ముప్పు పెరగొచ్చని డబ్ల్యూఎంఓ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్-నవంబర్ మధ్య దాదాపు అన్ని భూభాగాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వర్షపాతం మాత్రం ప్రాంతాన్ని బట్టి మారుతుందని తెలిపింది.
భారత్‌పై ఎల్‌నినో ప్రభావాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఓడీ) కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పాజిటివ్ ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని అంచనా. దీంతో ఎల్‌నినో వల్ల భారత్‌లో సాధారణంగా కనిపించే ప్రభావాల్లో కొంత మార్పు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వ్యవసాయం నుంచి నీటి వనరుల వరకు..
ఎల్‌నినో 2027 ప్రారంభం వరకు కొనసాగితే దాని ప్రభావం ఒక్క సీజన్‌కే పరిమితం కాకపోవచ్చు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్, నీటి వనరుల వంటి వాతావరణంపై ఆధారపడే రంగాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
అందుకే ప్రభుత్వాలు, వాతావరణ సంస్థలు ముందస్తు హెచ్చరికలు, విపత్తు సన్నద్ధత చర్యలను మరింత బలోపేతం చేయాలని డబ్ల్యూఎంఓ సూచిస్తోంది.
ఎల్‌నినో సహజమైన వాతావరణ చక్రంలో భాగమే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సమయంలో ఇది మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ హెచ్చరిక స్పష్టం చేస్తోంది.

