AP

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసు.. నిందితుడు జాన్ సైదా హర్యానాలో అరెస్ట్..

గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ జాన్ సైదాను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిందితుడిని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను షేక్ జాన్ సైదా (రబ్బానీ) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని, మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తన కుమార్తె అపహరణకు గురైందని, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోవడం పోలీసుల వైఫల్యమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికి సిగ్గుచేటు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకోవడంలో చూపిన శ్రద్ధ, బాలికను రక్షించడంలో ఎందుకు చూపలేకపోయారని న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబట్టింది.

ఈ కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం, బాలికను గురువారం కోర్టులో హాజరుపరచాలని నేరుగా ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడంతో, డీజీపీ సిట్ నియామకం జరిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే, సాంకేతిక ఆధారాలతో నిందితుడు జాన్ సైదా హర్యానాలో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని, బాలికను గుంటూరుకు తరలించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.