AP

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..!

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో దర్యాప్తు కొలిక్కి వస్తున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హవాల్దార్‌ మల్లేశ్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ డీలర్లతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్లేశ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు పలు అనుమానాస్పద అంశాలు కనిపించినట్లు సమాచారం. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆయుధ డీలర్‌ను ఫాలో అవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

సదరు పాక్‌ డీలర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వివిధ రకాల షాట్‌గన్స్‌, ఏకే-47 తుపాకులకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో మల్లేశ్‌ ఆ ఖాతాను ఎందుకు ఫాలో అయ్యాడు? అతడికి ఆ డీలర్‌తో ఏమైనా ప్రత్యక్ష సంబంధాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

దొంగిలించిన సైనిక ఆయుధాలను విదేశీ ఆయుధ డీలర్లకు లేదా అక్రమ ఆయుధ ముఠాలకు విక్రయించాలనే ఉద్దేశంతోనే మల్లేశ్‌ చోరీకి పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే పాక్‌ డీలర్‌తో మల్లేశ్‌కు వాస్తవంగా సంబంధాలు ఉన్నాయా? అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

మల్లేశ్‌ ఉపయోగించిన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటినీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. డిజిటల్‌ ఆధారాలు, ఆన్‌లైన్‌ పరిచయాలు, ఇతర కార్యకలాపాలను విశ్లేషిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఆయుధాల చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? ఏదైనా పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోందా? అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.