అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ప్రారంభమైన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి రైతులకు ఎటువంటి అపోహలు లేకుండా ప్రత్యేకంగా టోల్ ఫ్రీనెంబర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని విద్యుత్ ఉత్పత్తిని వివిధ ప్రాంతాలలోని గ్రిడ్లకు అనుసంధానించేందుకు హైపవర్ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం సాగుతోంది. ఈ పనులను రెజోనియా కంపెనీ చేపట్టింది. సదరు కంపెనీతో రైతులు తమతమ సందేహాలను నేరుగా కంపెనీతో చర్చించే విధంగా ఒక హాట్లైన్ టోల్ ఫ్రీనెంబర్ని ఏర్పాటు చేశారు. హాట్లైన్ టోల్ ప్రీ నెంబర్ని (1800 309 4401) జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రెజోనియా కంపెనీ ప్రతినిధులతో కలసి తన చాంబర్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ చాలా వరకు ట్రాన్స్మిషన్ టవర్ నిర్మాణాలు సాగుతున్న ప్రాంతాల్లోని రైతులు వివిధ సందేహాలతో సతమతమవుతున్నారని వారి సందేహాలు నివృత్తి కోసం ఈహాట్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతో దోహదపడుతుందన్నారు. హాట్లైన్ నెంబర్ వల్ల మద్యలో ఎటువంటి దళారులు లేకుండా నేరుగా రైతులు సదరు కంపెనీతో మాట్లాడేందుకు వీలవుతుందన్నారు. ఇదొక మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో రెజోనియా అనంతపురం ప్రాజెక్టు హెడ్ గిరి ప్రసాద్, రెసోనియా ఆర్ ఓడబ్ల్యు మేనేజర్ వినోద్, రెసోనియా సీ ఎస్ ఆర్ మేనేజర్ కృతిక లక్ష్మి, రెసోనియా ఎక్స్క్యూజన్ మేనేజర్ జైకుమార్, రెజోనియా కంపెనీ ప్రతినిధి అశోక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెజోనియా ప్రాజెక్టు హెడ్ గిరిప్రసాద్ మాట్లాడుతూ కర్నాటక నుంచి అనంతపురం జిల్లా మీదుగా కడపజిల్లా సీకే దిన్నెవరకు తమ ట్రాన్స్మిషన్ లైను పనులు సాగుతున్నాయని మా కంపెనీ పరిధిలో దాదాపు 40వేలమంది వరకు రైతులు ఉంటారని వారికి ఉపయోగపడే రీతిలో ఈ టోల్ ప్రీ నెంబర్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్ సోమవారం నుంచి శువ్రారం వరకు పనిదినాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందన్నారు. రైతులు తమకు ఎటువంటి అపోహలు ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి తమతమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.

