AP

లెక్కలేనంత మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారు..! అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్..

డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వినతిపత్రం అందించారు. ఘటనకు సంబంధం లేని వారిపై కూడా కేసులు పెట్టారని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ… లెక్కలేనంత మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. నిరసన సమయంలో పోలీసులు మితిమీరిన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడలో మల్లాది విష్ణు ధర్నా చేస్తే ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారని… దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని మండిపడ్డారు. 

కోర్టులు అక్షింతలు వేసిన పోలీసుల తీరు మారడం లేదని అంబటి విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతూ పోలీసులు అభాసుపాలు అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు తెరవడం ఏ ప్రాతిపదికన జరుగుతోందని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ మామాళ్ల దందా నడిపిస్తున్నారని… ఆయనపై కూడా రౌడీషీట్ పెట్టాలని అన్నారు