డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ చేస్తోన్న ఆరోపణలపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైకాపా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని కడపలో మండిపడ్డారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామకాల్లోనే అసలైన భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు చేతులు మారాయని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఒక్కో ఉద్యోగాన్ని వైకాపా నాయకులు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు అమ్ముకున్నారని, మొత్తం రూ. 500 కోట్ల మేర అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే ఉద్యోగాల్లో దాదాపు 1,300 మంది అనర్హులకు లబ్ధి చేకూర్చారని రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం స్కూల్ గేమ్స్ స్థాయి అర్హతతో చాలామందికి పోస్టింగ్‌లు ఇచ్చారని, చివరికి సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలలో పాల్గొన్న వారికి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న శ్వేత అనే క్రీడాకారిణిపై జగన్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సర్టిఫికెట్ ఆలస్యమైనందునే ఆమెకు ఆలస్యంగా ఉద్యోగం వచ్చిందని, గతంలో నిబంధనలకు విరుద్ధంగా జూడో ఆటకు సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
సచివాలయ ఉద్యోగాల అక్రమాలపై సీబీఐ విచారణకు జగన్ సిద్ధమా అని రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో అంగళ్లు ఘటనలో చంద్రబాబుపైనే దాడి చేసి, తిరిగి 3 వేల మందిపై కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో తాను ఎమ్మెల్సీగా గెలిచినా డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేశారు. 2019-24 మధ్య కాలంలో జరిగిన అన్ని రకాల నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైకాపా అధిష్టానానికి సవాల్ విసిరారు.

