ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీపై చర్చించేందుకు సోమవారం (అక్టోబర్ 26) జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 21వ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ భేటీని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ముంబై పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేరని తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీఫ్ కేఆర్ఎంబీకి లేఖ ద్వారా తెలియజేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక చర్చల నిమిత్తం ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కారణం చేత సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేఆర్ఎంబీ, సమావేశాన్ని మంగళవారానికి రీషెడ్యూల్ చేసింది. ఈ మార్పునకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధికారికంగా తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, నీటి పంపిణీకి సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

