AP

మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం..

రాష్ట్రంలో మురసు తుఫాను ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు , క్షేత్రస్థాయి సిబ్బందితో సుదీర్ఘ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో వచ్చిన ఆర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తీవ్రత తక్కువే అయినప్పటికీ, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ముఖ్యంగా పలనాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు నాగార్జున సాగర్, పులిచింతల, బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలకు వరద ప్రవాడు పోటెత్తే ఛాన్స్ ఉండటంతో ఇరిగేషన్ శాఖను అప్రమత్తం చేశారు. రేపు ఒక్క రోజే బుడమేరుకు దాదాపు 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, అలాగే ప్రకాశం బ్యారేజికి డిసెంబర్ 4 నాటికి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు చేరేలా అంచనా వేశారు.

ఇవాళ రాత్రి 12 గంటల నుంచి రేపు రాత్రి 12 గంటల వరకు సమయం కోస్తా తీర ప్రాంతాలకు చాలా కీలకమని సీఎం పేర్కొన్నారు. సుమారు 848 స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పరిధిలో దీని ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే గుర్తించి సురక్షిత ప్రాంతాలు, తుఫాను షెల్టర్లకు తరలించాలని ఆదేశించారు. చిన్న నీటి వనరులు, మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ తుఫాను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏకంగా 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందిని రంగంలోకి దించారు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున.. పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా 5 వేల మంది విద్యుత్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఎక్కడైతే సరఫరా నిలిచిపోతుందో, అక్కడ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని చెప్పారు.

ఆర్నబ్ తుఫాను సమయంలో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలిగామని సీఎం గుర్తుచేశారు. ఈసారీ కూడా అదే స్ఫూర్తితో పనిచేసి ఎక్కడా ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంతగా తగ్గిస్తేనే ప్రజలకు ప్రభుత్వపరంగా పూర్తి భరోసా కలుగుతుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తుఫాను తీరం దాటే వరకు సిబ్బంది అంతా విధుల్లోనే అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు