దొంగతనం అంటే ఇళ్లలో నగలు, డబ్బులు లేదా పొలాల్లో పంటను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఖమ్మం జిల్లాలో దొంగలు చేసిన పని రైతును విస్తుపోయేలా చేసింది. చేతికి వచ్చిన పంటను కోతకు సిద్ధం చేసుకున్న సమయంలో మిరప తోటలోకి చొరబడి చెట్లకు ఉన్న పండిన కాయలన్నీ కోసుకెళ్లారు. దీంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన గుత్తా నాగరాజు తనకున్న ఎకరం 20 కుంటల భూమిలో మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలో మొదటి విడత పంట కోతకు సిద్ధమైంది. కాయలన్నీ పండి ఎర్రగా మారడంతో మరికొద్ది రోజుల్లో కూలీలను పెట్టి కోత కోయించాలని ఆయన భావించారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మిరప తోటలో మైసమ్మ తల్లికి పాలు పొంగించేందుకు ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడికి చేరుకుని చూడగా తోటలోని ఓ భాగంలో చెట్లకు మిరపకాయలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తోటలోకి ప్రవేశించి పండిన మిరపకాయలను కోసుకెళ్లినట్లు గుర్తించారు. చేతికందిన పంటను దొంగలు ఎత్తుకెళ్లడంతో నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

