దేశవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసలయ్యే ప్రమాదం పెరుగుతోందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ సమస్యతో తీవ్రంగా ప్రభావితమవుతోందని, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఈ సమస్య విస్తరించిందని అన్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే యువత భవిష్యత్తును, దేశ అభివృద్ధిని కాపాడుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు.
డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తులు విచక్షణ కోల్పోయి కుటుంబాలకు, సమాజానికి భారంగా మారుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి వినియోగిస్తున్నారని ఆరోపించారు. న్యూక్లియర్ కుటుంబాల పెరుగుదల, యువతలో స్వేచ్ఛను కోరుకునే ధోరణి కూడా డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణాలుగా మారుతున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

