ఈ ప్రతిపాదన ప్రకారం.. ఖాతాదారులు నిర్ణయించుకున్న పరిమితికి మించి నగదు బదిలీ చేయాలంటే వారు ఎంపిక చేసుకున్న నమ్మకమైన వ్యక్తి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గంట సమయం కేటాయించారు. ఆ సమయంలోగా ట్రస్టెడ్ పర్సన్ అనుమతి ఇవ్వకపోతే సదరు లావాదేవీ ఆటోమేటిక్గా రద్దవుతుంది. డిజిటల్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.
గతంలో ఏప్రిల్లో విడుదల చేసిన చర్చాపత్రంలో అధిక మొత్తంలో జరిగే అన్ని డిజిటల్ లావాదేవీలకు గంటపాటు కూలింగ్ పీరియడ్ విధించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అయితే తాజా ముసాయిదాలో ఆ ప్రతిపాదనను తొలగించింది. గతంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే ట్రస్టెడ్ పర్సన్ సదుపాయం కల్పించాలని భావించగా, ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులందరికీ ఐచ్ఛికంగా అందించాలని సూచించింది. అంటే ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి కాదు. తమ అవసరాన్ని బట్టి ఖాతాదారులు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.

