ఎల్నినో, వర్షాభావ పరిస్థితులను చూసి తెలంగాణ రైతులు, గ్రామీణ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు. రాబోయే వాతావరణ సవాళ్లను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకత, తాగు–సాగునీటి భద్రత, గ్రామీణ జీవనోపాధిని కాపాడేందుకు రూ.10 వేల కోట్లతో భారీ ఎల్నినో–కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు.బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్ కాకతీయలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడారు.
రానున్న సంక్రాంతి తర్వాత ఐదు నెలలపాటు ప్రతినెలా రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.వాతావరణ మార్పు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే మన జీవన విధానం, వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం చూపుతున్న వాస్తవమని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలు, వర్షపాతంలో అసమానతలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి వనరులపై ఒత్తిడి, వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ముప్పులను ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ దృక్పథం, శాఖల మధ్య సమన్వయంతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.రూ.10 వేల కోట్ల కార్యక్రమంలో చేపట్టే ప్రతి పని రైతులకు, గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేలా ఉండాలని అధికారులకు సూచించారు.
ఖర్చు చేసే ప్రతి రూపాయికి ప్రజలకు స్పష్టమైన ఫలితం కనిపించాలని, కార్యక్రమం తాత్కాలిక ఉపశమనానికి పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించాలని చెప్పారు. క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఐదంచెల కరువు నివారణ వ్యూహం ప్రతిపాదిత ఎల్నినో–కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని ఐదు ప్రధాన రంగాలపై అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. చెరువులు, కాలువలను పునరుద్ధరించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర జల వనరులను అభివృద్ధి చేయడం రెండో ప్రధాన అంశమని చెప్పారు.
‘పొలం బాట’ కార్యక్రమం ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం మూడో అంశమన్నారు. వాగులు, స్థానిక నీటి ప్రవాహ మార్గాలను అభివృద్ధి చేసి వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకోవడం, భూగర్భజలాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం నాలుగో అంశమని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత మౌలిక వసతులను బలోపేతం చేయడం ఐదో ప్రధాన అంశమని వివరించారు.ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావాలంటే నీటిపారుదల, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, అటవీ తదితర శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రణాళిక రూపకల్పన నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ రైతులు, గ్రామీణ ప్రజల అవసరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వాతావరణ పరిరక్షణను కేవలం ఒక సవాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక ఆవిష్కరణలకు గొప్ప అవకాశంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజీ కలిపి 6,000 మెగావాట్ల సామర్థ్యానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

