Health

మళ్ళీ టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు

చద్దెన్నం

చద్దెన్నం తింటే మంచిదని, ఆరోగ్యం అని పెద్దలు చిన్నతనంలో పొద్దుటే మనకి తినడానికి పెట్టినప్పుడు ఏడుపొచ్చేది. దానిలోకి ఆవకాయో, మాగాయో, తొక్కు పచ్చడో కలిపి ముద్దలు చేసి పెడితే తినేవాళ్ళం.

కొందరిళ్ళల్లో అన్నం బదులు ఉదయం టిఫిన్లు తినేవారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు, మాకూ కావాలని పిల్లలం పేచీ పెడితే, సముదాయించినంత సేపు సముదాయించి, వీపు విమానం మోత మోగించేవారు. హైస్కూల్ అయ్యేంత వరకూ దాదాపు అన్ని ఇళ్ళల్లోనూ ఇదే తంతు.

ఉత్తప్పుడు ఎంత మారాం చేసినా, వేసవి వస్తే పుల్లటి తరవాణీలో ఆవకాయ కలిపి పెడితే మారు మాట్లాడకుండా తినేసేవాళ్ళం.

చద్దెన్నంలో మజ్జిగ పోసుకుని, నల్చుకుందుకు మాగాయ టెంక వేసుకుని, దాన్ని అమృతం జర్రుతున్నట్టు చీకుతూ కూర్చుంటే టైమ్ తెలీసేది కాదు.

కాలేజ్ కి వచ్చిన తరువాతే ఆ రోజుల్లో పిల్లలకి వేడన్నం పెట్టేవారు. అలాగే కాఫీ తాగే అర్హత కూడా అప్పుడే వచ్చేది.

దానికోసమే ఎప్పుడు కాలేజ్ కి వస్తామా? ఎప్పుడు చద్దెన్నం బాధ తప్పుతుందా అని ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయ్.

ఒక్కొక్కసారి రాత్రి మిగిలిపోయిన అన్నం లో పాలుపోసి, ఉల్లిపాయలు వేసి తోడుపెట్టే వారు. ఉదయానికి అది కమ్మగా తోడుకుని అద్భుతంగా ఉండేది. అలా తినే అదృష్టం నూటికి కోటికి ఒకసారి మాత్రమే ఉండేది. ప్రతి రోజూ మజ్జిగతోటే సరిపెట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ జనాభా ఎక్కువ. మంది ఎక్కువైతే మజ్జిగ పలచ బడుతుందనే సామెత అందుకే వచ్చింది.

చాలా కొద్దిమంది ఇళ్ళల్లోనే రోజూ పెరుగు పోసుకు తినే భాగ్యం ఉండేది. అలాంటి వాళ్ళని చూస్తే, ఎంత అదృష్టవంతులు వీళ్ళు? అని అనుకునేవాళ్లం.

ఏదైనా పండగో, పబ్బమో వస్తే ప్రత్యేకించి పెరుగు తోడు పెట్టేవారు. ఆ విషయం చివరికంటా గుట్టుగా ఉంచి, మజ్జిగ అన్నంలోకి వచ్చేసరికి ఎవరికైనా అన్నం కావాలా అని అడిగేవారు. నీళ్ళ మజ్జిగలోకి మళ్ళీ అన్నం ఎందుకులే అని వద్దంటే, అప్పుడు పెరుగు గిన్నె పట్టుకొచ్చే వారు. అపుడు చూడాలి తండ్రీ! పిల్లల మొహాలు, బోల్డంత బాధ కొట్టొచ్చినట్టు కనిపించేది.

అలా కాసేపు ఏడిపించాక, అప్పుడు అన్నం మారు వడ్డన అడిగేవారు.‌‌

చెప్పకపోవడానికి ఏముంది కానీ! పిల్లలతో పాటు పెద్దాళ్ళు కూడా మరోసారి అన్నం పెట్టించుకుని, దాన్లోకి బెల్లమో, కొబ్బరి ముక్కో, మామిడి పండో, అరటి పండో అనుపానంగా తీసుకుని తృప్తిగా భోజనం ముగించే వారు.

కొద్ది మంది ‌మాత్రం పులుసు ముక్కలో, ఆవకాయబద్దో, మాగాయటెంకో వేసుకుని తాదాత్మ్యం ‌చెందేవారు.

అమ్మమ్మ గారింటికి సెలవల్లో అందరం వెడితే మజ్జిగ లోకి వచ్చే సమయానికి పిల్లలందరూ పెరుగు, పెరుగు అంటూ గోల పెట్టే వాళ్ళం.

పెరుగే!.‌.. పెరిగి….పెద్దవ్వండి, బాగా చదివి పైకొస్తే ముప్పొద్దులా పెరుగేసుకుని తినొచ్చు అనేవారు.

తాత గారింట్లో అందరికీ మజ్జిగ, తాతకు మాత్రం పెరుగు.

ఆయన చివర్లో పెరుగు అన్నం వదిలేస్తే ఎవరో ఒకరికి పెట్టేవారు.

నిజం చెప్పద్దూ అప్పట్లో పెరుగు రుచే వేరు.

పెద్దవాళ్ళ దీవెన ఫలించి ఇప్పుడు ముప్పొద్దులా పెరుగు తినే స్థాయికి వచ్చినా, కొంచెం కూడా తినబుద్ధి కావటంలేదు. ఆ రుచి ఇప్పుడు ఎంత వెదికినా కనిపించటం లేదు.

రాత్రన్నం మిగిలి పోతే పులిహోర కలపటం కొందరిళ్ళల్లో ఆనవాయితీ.

ఆ నమ్మకం ఎంతగా బల పడిందంటే! ఇప్పటికీ ఎవరింటికైనా వెళ్ళినపుడు ఉదయం పూట ఎవరింట్లో అయినా పులిహార పెడితే, అంతకు ముందు రోజు రాత్రి వాళ్ళు ఏదైనా విందుకేమైనా వెళ్ళారా? అని అనుమానించేంత.

అప్పట్లో ముప్పొద్దులా తింటే పిల్లలు బలంగా ఉండి ఏపుగా ఎదుగుతారని పెద్దవాళ్లు నమ్మేవారు. దీనికి తోడు ఉమ్మడి కుటుంబాల్లో టిఫిన్లు చేయటం కష్టంగా ఉండేది. అప్పట్లో చాలా మందికి అంత ఆర్ధిక స్తోమత ఉండేది కాదు. ఆ కారణం వల్లే చద్దెన్నం సంస్కృతి అప్పట్లో ప్రతి చోటా దర్శనమిచ్చేది.

ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అన్నం పెట్టే తరీఖానే వేరుగా ఉండేది.

చద్దెన్నం పెట్టే బాధ్యత అమ్మమ్మలు ఎక్కువగా తీసుకునే వారు. ఒక పెద్ద బేసిన్లో చద్దెన్నం వేసి దాంట్లో మాంఛి ఖారంగా ఉండే ఒర్ర కూడు ఎర్రగా కలిపి, చెయ్యి నిండిపోయేంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టి, ఓ కథో కాకరకాయో చెప్పేవారు.

ఆ కధల్లో ఎక్కువగా భీముడో, హనుమంతుడో హీరోలుగా ఉండేవారు. వాళ్ళు ఏది పెట్టినా అంత బాగా తినేసేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు అని చెప్పేవారు. అసలు వాళ్ళు బలవంతులు కావడానికి కారణం చద్దన్నం బాగా తినడమే అని నూరి పోసేవారు.

ఒక్కోసారి కృష్ణుడు, రాముడు కూడా ఈ కథల్లోకి వచ్చేవారు. నిజమో, అబద్ధమో తెలియదు కాని, తులసీ రామాయణంలో రాముడు పెళ్ళయ్యే సమయానికి కూడా తమ్ముళ్ళతో కలిసి చద్దెన్నం తిన్నట్టు ఉందని చెప్పేవారు. అంతేకాదు ఆయన చక్రవర్తి కావడానికి కూడా కారణం అదేనని నమ్మ బలికేవారు. ఎవరు ముందు తింటే వాళ్ళు చక్రవర్తి, ఆ తర్వాత తినేవాళ్ళు మహారాజులు, ఆ తర్వాత తినేవాళ్ళు నృపాధిపతులు ఇలా గ్రేడింగ్ ఇచ్చేవారు.

అవన్నీ శ్రద్ధగా విని నిజమే అనుకుని పిల్లలంతా పోటీపడి చక్రవర్తి పోస్టు కోసం తాపత్రయ పడేవాళ్ళం. ఒకవేళ ఆ టైటిల్ చేతికొస్తే ఆ రోజంతా కిరీటం లేని చక్రవర్తుల్లా సంబరపడిపోయే వాళ్ళం. దాంతో మళ్ళీ పెచీ. ఆ తర్వాత ఏదైనా ఇంట్లో పని చెబితే అందరికన్నా ముందు చేసేసి, ఎలా అయినా, చక్రవర్తి అయిపోవాలనే తాపత్రయం ఉండేది.

నలుగురితో కలిసి తినడం, పెద్దవాళ్లు చెప్పే పనులు చేసి పెట్టడం, హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండటం ఆ రోజుల్లో ఉండేది.

పిల్లల్ని ఎలా సంతోషంగా ఉంచాలో అప్పటి వాళ్ళకు తెలిసినట్టు ఎవరికి తెలియదేమో? ఇంతకన్నా గొప్పగా ఏ చైల్డ్ సైకాలజిస్ట్ చెప్పగలడు? చెప్పండి.

మేం పుట్టి పెరిగిన తణుకులో ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులు, కీర్తి శేషులు, శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఓ రోజు ఓ మీటింగులో మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ ఉదయం లేచి, రాత్రి తోడుపెట్టిన పెరుగు అన్నం తినే వాడినని, అప్పట్లో ఒకసారి చెప్పారు.

దాంతో పిల్లలకి ఆయన్ని ఉదాహరణగా చెప్పేసి, చద్దెన్నం తింటే ఆయనంత గొప్పవాళ్ళు అవుతారని మాకు చెప్పేవారు.

దాంతో మాకు ఆయనంటే కోపంగా ఉండేది. తరువాత తరువాత వారి గొప్పతనం తెలిసి, పెద్దయ్యాక గౌరవం ఏర్పడింది, అది వేరే విషయం అనుకోండి.

మా నాన్నగారు ఎప్పుడూ చద్దెన్నం శాస్త్రి గారి కథ చెప్పేవారు.

పూర్వం ఒక ఊళ్ళో చద్దెన్నం శాస్త్రి గారని, ఒక గొప్ప శివభక్తుడు ఉండేవారట.

వారు ప్రతినిత్యం, ఉదయమే లేచి స్నానాదికాలు కావించుకుని, సంధ్యా వందనం చేసుకుని, చద్దెన్నం తిని, అప్పుడు అభిషేకం చేసేవారట.

దాంతో ఊరి జనం ఆయన్ని వెలేసి, ఆయన చేసే అనాచారాన్ని యాగీ చేస్తూ నవ్వుకునేవారట.

ఇలా ఉండగా…..ఒకసారి ఆ ఊరి మహారాజుకి శివుని జుట్టు నలుపా?లేక రాగి వర్ణంలో ఉంటుందా? అనే ఒక సంశయం కలిగిందట. దాంతో ఆయనకి చాలా మంది పండితులతో విపరీతమైన చర్చ జరిగింది.‌

రాజుకు తృప్తి కలిగే విధంగా సమాధానం దొరక్కపోవటంతో, ఎవరో వేళాకోళానికి, పోనీ, చద్దెన్నం శాస్త్రి గారిని అడక్కూడదు? అన్నారట.

అది వినగానే అక్కడున్న అందరూ గొల్లున నవ్వారట.

ఆ ఊరి రాజుగారు మాత్రం, అడిగితే తప్పేముందని ఆయన్ని కలిసారు.

శాస్త్రి గారు రాజావారి సందేహం విని, మరుసటి రోజు ఉదయం వచ్చి స్వయంగా
చూసి తెలుసుకోమని చెప్పారట.

రాజు ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఉదయం శాస్త్రిగారింటికి వెళ్ళారు.

అతిథి ఇంట్లో ఉండగా ఒక్కడే తినడం సంస్కారం కాదు కనుక, రాజుగారికి కూడా చద్దెన్నం వడ్డించారు, శాస్త్రిగారి సతీమణి.

భోజన కార్యక్రమం అయిన తరువాత శాస్త్రిగారు అభిషేకం మొదలెట్టారు.

ఆయన సంకల్పం చెప్పి, ఆవాహన మంత్రం చదవగానే శివుడు స్వయంగా వచ్చి అభిషేకం పీఠం మీద కూర్చున్నాడట.

అది చూసాక రాజుకు శివుడి జుట్టు రాగిరంగులో ఉంటుందని నిర్ధారణ కలిగింది.

అంతే కాదు శాస్త్రి గారిలో ఉండే అనన్య భక్తి, గొప్పతనం కూడా తెలిసింది.

అప్పటికి కానీ ఆ ఊరి జనానికి శాస్త్రిగారి విలువేమిటో అర్థం కాలేదట.

అదీ కథ.

ఈ కథ చెప్పే మానాన్నగారు మా అమ్మను పెళ్ళి చేసుకున్నారు.

అంతవరకు ఎందుకండీ, నేటికీ తిరుపతి వెంకన్నకు మూడుపూట్లా అన్నం తినే అలవాటు ఉంది. ఉదయం ఆయనకు పెట్టే అన్నాన్ని తిరుమల పండితులు బాలభోగం అంటారు. చద్దెన్నం తిని(ఆఫ్ కోర్స్ అది వేడన్నమే అనుకోండి) ఆయన ఎంత సంపాదిస్తున్నాడో చూడండి.

పిల్లలకు అమ్మవారు వచ్చి తగ్గాక చద్ది నైవేద్యం పెట్టే సంస్కృతి నేటికీ తెలుగు ఇళ్ళల్లో ఉంది.

పూర్వం ఎవరింట్లో అయినా, విందో వినోదమో, పెళ్ళో, పండగో లేక వేరే ఏదైనా విశేషం జరిగితే ఉదయన్నే పిన్నో, అమ్మమ్మో, అత్తో… పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ పెద్ద పెద్ద ముద్దలు కలిపి, చేతిలో పెడుతూ ఉంటే, పెద్దవాళ్ళకు కూడా నోరు ఊరి, దొంగతనంగా రెండు ముద్దలు తిన్న దృష్టాంతాలు కోకొల్లలు.

అదీ చద్దికి, మనకీ ఉన్న అవినాభావ సంబంధం.

అప్పట్లో అన్నం తినే విధానమే వేరుగా ఉండేది.

చద్దెన్నం తినేటపుడు అమ్మమ్మ స్వచ్ఛమైన తేట తెలుగులో మాట్లాడేది.

మధ్యాహ్నం పెద్దాళ్ళతో భోజనం చేసేటపుడు తాతయ్య సంస్కృతం ముక్కలు పరిచయం చేస్తూ, వాడికి కాస్త ఆజ్యం పోయండి అనేవాడు. లేకపోతే త్వక్రం ఎలా ఉందోయ్! అనేవాడు. అదే కాదు, సూపం, అపూపం, చోష్యం, లేహ్యం నుంచి వంటింటి పోపుసామాన్లు సర్షపం, జీరకం నుంచి, కాయగూరలపేర్లు, పళ్ళ పేర్లు అన్నీ అలవోకగా వచ్చేసేవి.

నిజం చెప్పాలంటే మాకు చాలా వరకు సంస్కృత పరిచయం ఆ సమయంలోనే జరిగేది.

పిల్లలు కూడా అదేవిధంగా తాతయ్యా! మాకు దధి కావాలి అనో కాస్త శాకం వడ్డించండనో అడిగేవాళ్ళం.

సాయంత్రం భోజనాల సంగతి పిన్నులు చూసేవాళ్ళు.

ఆ సమయంలో మరదళ్ళతో, బావుమరుదులతో కబుర్లు చెబుతూ, ఇంటి అల్లుళ్ళు పిల్లలకి ఇంగ్లీష్ ముక్కలు, సినిమా కధలు అన్నంతో నలిచి పెట్టేసే వారు.

సమిష్టి కుటుంబాలు పోయి వ్యష్టి కుటుంబాలు వచ్చాక ఆనాటి చద్దెన్నం సంస్కృతి క్రమక్రమంగా తెరమరుగవ్వటం మొదలెట్టింది.

దానర్థం ఇపుడు చద్దెన్నం తినటం లేదని కాదు. నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్ సంస్కృతి వచ్చాక ఇదే ఎక్కువయ్యింది. కానీ తినటం లోనే పాత సంస్కృతి పోయింది.

ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చద్దెన్నం తినటం ఆరోగ్యానికి మంచిదని చెప్పటం వల్ల చద్దెన్నం సంస్కృతి
సమాజ యవనికపై తిరిగి ప్రవేశించింది.

ఈ రోజు అయిదు నక్షత్రాల హొటళ్ళలో సహితం చద్దెన్నం ఒక మెనూ ఐటెం.

ఉదయం పూట టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు మళ్ళీ వస్తాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది ప్రోబయాటిక్, ఐరన్ అండ్ కాల్షియం రిచ్. మరీ ముఖ్యంగా బి విటమిన్ దీనిలో పుష్కలంగా ఉంటుంది.

బావుందా!