తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. సింగర్ మంగ్లీ సినిమాలతో పాటు పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) సభలు ఎక్కడ జరిగినా మంగ్లీ అక్కడి వేదిక మీద పాటలు పాడి అందరినీ అలరిస్తుంటుంది. అలాగే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణిస్తున్న కారు మీద రాళ్ల దాడి జరిగింది.
కర్ణాటకలోని బళ్లారిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన సింగర్ మంగ్లి కారు మీద రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగ్లీ అక్కడికి చేరుకుంది. అయితే అక్కడికి వచ్చిన సింగర్ మంగ్లీని చూడటానికి వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోకి యువకులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. పోలీసులు యువకులను చెదగొట్టేందుకు లాఠీలకు పని చెప్పగా.. అక్కడి నుండి యువకులు పరారయ్యారు. ఆ తర్వాత మంగ్లీ తన కారులో బయలుదేరుతుండగా.. ఒక్కసారి యువకులు అంతా చుట్టుముట్టారు. ఉన్నట్టుండి మంగ్లీ ప్రయాణిస్తున్న కారు మీద రాళ్ల దాడి జరిగింది. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా మంగ్లీ పాల్గొన్న బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమానికి సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినిలు కూడా వచ్చారు.