వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అరెస్ట్ విషయంలోనూ జోక్యం చేసుకోబోమని కోర్టు వెల్లడించింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. వివేక హత్య కేసు విచారణలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని దర్యాప్తు అధికారులకు ధర్మాసనం సూచించింది. అవినాష్ రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని.. కానీ న్యాయవాదికి కనిపించేలా విచారణ చేయాలని ఆదేశించింది.
తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని, విచారణకు పిలవకుండా అడ్డుకోవాలని అవినాష్‌రెడ్డి కోర్టును కోరారు. తాజాగా అందుకు నిరాకరిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అటు వైఎస్ అవినాష్ రెడ్డి, ఇటు తండ్రి భాస్కర్ రెడ్డి, ఇద్దర్నీ వరుసగా విచారిస్తూ హీట్ పెంచేస్తోంది సీబీఐ. ఇన్నాళ్లూ అటూఇటూ తిరిగిన వైఎస్ వివేకా మర్డర్ కేసు చివరికి అవినాష్‌రెడ్డి ఫ్యామిలీ దగ్గరకొచ్చి ఆగింది. ఇప్పటివరకు తెరపైకి వచ్చిన పేర్లన్నీ సైడ్ అవుతూ ఎంపీ అవినాష్‌రెడ్డి… ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టే తిరుగుతోంది.
ఎంపీ అవినాష్‌రెడ్డి ఫ్యామిలీ నుంచి మొత్తం ఐదుగురు విచారణను ఎదుర్కొంటున్నారు. అందులో అవినాష్‌రెడ్డి మెయిన్ పర్సన్ కాగా, ఆ తర్వాత ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, పెదనాన్నలు ప్రకాష్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చిన్నాయన మనోహర్‌రెడ్డి ఉన్నారు. వీళ్లందరినీ ఇప్పటికే అనేకసార్లు పిలిచి ప్రశ్నించింది సీబీఐ. అయితే, పెదనాన్నలు ప్రకాష్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చిన్నాయన మనోహర్‌రెడ్డి పాత్ర లేదని దాదాపు నిర్ధారణకు వచ్చేసిన సీబీఐ… తమ ఫోకస్ మొత్తం అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిపై పెట్టింది. అయితే, సీబీఐ అభియోగాలను తప్పుబడుతున్నారు అవినాష్‌రెడ్డి. అసలు విచారణే సరిగా జరగడం లేదంటున్నారు. తాము చెప్పేది సీబీఐ వినడం లేదన్న ఆయన వెర్షన్. ఒక వ్యక్తి చెప్పిన మాటల ఆధారంగా దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటికి వస్తాయంటున్నారు అవినాష్. సీబీఐ విచారణ వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయంటున్నారు అవినాష్‌రెడ్డి. తప్పుడు ఆధారాలతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిరపరాధులను కాపాడాల్సిన సీబీఐనే… కంచే చేను మేస్తే… ఇక తమకు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు అవినాష్‌రెడ్డి.