AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సిఎస్ కెఎస్.జవహార్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన జిల్లా కలెక్టర్లలో చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, బాపట్ల, కృష్ణా, విజయనగరం ఉన్నారు. వివిద శాఖలలో ఐఏఎస్ అధికారులుగా పనిచేస్తున్న మరో 48 మంది బదిలీ అయ్యారు.

వీరందరూ ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేసినవారే కావడం గమనార్హం. కనుక నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుతో మొదలైన ఈ తంతు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారుల బదిలీలతో పూర్తయిందని భావించవచ్చు. ఇక ఈ బదిలీలకు ముందస్తు ఎన్నికలు మరో కారణం అయ్యుండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బదిలీలకు ఇంకా మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ, హటాత్తుగా ఇంతమందిని బదిలీ చేయడం ముందస్తు ఎన్నికల కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

గత నెల సిఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ని కలిసిన తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్ళి అమిత్‌ షా తదితరులను కలిసివచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి పవన్‌ కళ్యాణ్‌కి పిలుపు వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో ఉండగానే బిజెపి-జనసేనలు కలిసి పనిచేస్తాయనే ప్రకటించుకొన్నారు. ఇది ఖరారు కాగానే ఏపీలో 56 మంది ఐఏఎస్ అధికారులను జగన్ ప్రభుత్వం బదిలీ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి రాగానే మంత్రులు, ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశమయ్యి ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ప్రారంభించాలని నొక్కి చెప్పారు. అప్పుడే ఆ హడావుడి మొదలైంది కూడా.

వీటన్నిటినీ కలిపి చూస్తే జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు అర్దమవుతోంది. బహుశః తెలంగాణతో పాటు డిసెంబర్‌లోగా ముందస్తు ఎన్నికలకి వెళ్ళవచ్చుననుకొంటే, వాటికి 3-4 నెలల ముందు అంటే సెప్టెంబర్‌ లేదా అక్టోబరులో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. అప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక తమకు కలెక్టర్లని, ఐఏఎస్ అధికారులను కోరుకొన్న చోటకి బదిలీ చేసుకొనేందుకు అవకాశం ఉండదు. కనుక ఇప్పుడే అవసరమైన జిల్లాలకు, కీలక స్థానాలకు బదిలీలు చేసుకొంటే, ఈ 4-5 నెలల్లో వారు అక్కడ పూర్తి పట్టు సాధించగలరు. బహుశః ఇందుకే హటాత్తుగా ఈ బదిలీలని అనుకోవచ్చు.

బదిలీలలకు పరిపాలనపరమైన కారణాలతో పాటు ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఉద్యోగుల సంఘాల నేతలు ఇదివరకు గవర్నర్‌గా వ్యవహరించిన బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శిగా చేస్తున్న ఆర్‌పి సిసోడియాయే వారికి అపాయింట్మెంట్ ఇప్పించారని ఆగ్రహించిన వైసీపీ ప్రభుత్వం, వెంటనే ఆయనను బదిలీ చేసింది కానీ ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇప్పుడు పనిష్మెంట్ పోస్టుగా పరిగణించబడుతున్న ‘ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థ’ డైరెక్టరుగా నియమించింది.