AP

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. అన్నట్లుగానే ఇవాళ పోరు మొదలుపెట్టేసింది. ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు.

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు.

తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని పార్టీ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు.

ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరిన నేపథ్యంలో.. . ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావం తెలుపుతూ తోట దీక్షలో పాల్గొన్నారు. ప్రధాని మోడి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను తన అనుయాయుడైన అదానికి దొడ్డి దారిన దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.

ఉన్న స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించకుండా కడపలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని తోట పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్లాంట్ పై ఆధారపడి జీవించే లక్ష కుటుంబాలు రోడ్డున పడే దుర్ధర పరిస్తితులు కేంద్రం కల్పించబోతోందని వాపోయారు.

రాష్ట్రపతి పేరు మీదున్న విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్ కు బదిలీ చేయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడి నిధులివ్వకుండా గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు. మోడి చేష్టలు గమనించిన తెలంగాణ సిఎం కేసి ఆర్ తాను అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న రూ.25 కోట్ల చెక్కును తిరిగి తీసుకెళ్లారని గుర్తుచేశారు.

రూ.45 లక్షల కోట్లున్న జాతీయ బడ్జెట్ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఐదు వేలకోట్ల నిధులు కేటాయించలేదా అని తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానివి కావు, బిజెపివి కావు అవి తెలుగు ప్రజల ఆస్తులని మోడి గుర్తించాలన్నారు.