AP

తాడేపల్లి టూ విశాఖ జగన్ ప్రయాణం ముగుస్తుందా?

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం శ్రీకాకుళం జిల్లాలో మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుకి, నౌపాడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, ఎచ్చెర్ల మండలంలో బుడగట్లపాలెంలో ఫిస్షింగ్ హార్బర్‌కి, హీరమండలంలో వంశధార ఎత్తిపోతల పదకాలకి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని, మరో రూ.365 కోట్లతో బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని కానీ తన ప్రభుత్వం ఒకేసారి జిల్లాలో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టిందన్నారు.

వీటిద్వారా 35,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని అన్నారు. ఈ పోర్టు నిర్మాణాలు పూర్తయితే వాటి అనుబంద పరిశ్రమలు కూడా వస్తాయి కనుక అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని సిఎం జగన్‌ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన మొదలవుతుంది. అప్పుడే నేను ఫ్యామిలీతో సహా విశాఖకు షిఫ్ట్ అవుతాను,” అని చెప్పారు.

ఇప్పుడు రెండు విషయాల గురించి తప్పక చెప్పుకోవలసి ఉంటుంది.

1. ఈ ఏడాది ఫిభ్రవరి-మార్చి నెలల్లో ఢిల్లీ, విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న సిఎం జగన్‌, ఏపీకి విశాఖపట్నమే రాజధాని. అందుకే నేను అతి త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని నొక్కి చెప్పారు. రెండు వారాల తర్వాత ఇప్పుడు కాదు. జూలైలో విశాఖకి షిఫ్ట్ అవుతానని చెప్పారు. ఇప్పుడు జూలైలో కాదు. సెప్టెంబర్‌లో షిఫ్ట్ అవుతానని సిఎం జగన్‌ చెపుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధానిగా ఉంటుంది అందుకే నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకొంటున్నానని జగన్‌ చెప్పారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఈసారి ఎన్నికలకు ముందు విశాఖకి వచ్చేస్తానంటున్నారు. కానీ మార్చి, జూలై, సెప్టెంబర్‌ అంటూ వాయిదా వేస్తున్నారు. అంటే విశాఖ షిఫ్ట్ అవడం కూడా అటువంటిదే అనుకోవాలేమో? గత ఎన్నికల కోసం తాడేపల్లిలో ఇల్లు కట్టుకోగా లేనిది ఈసారి ఉత్తరాంద్ర ప్రజలను నమ్మించడానికి విశాఖలో ఇల్లు కట్టుకోవడం కష్టమా?అయినా ఎన్నికలలో గెలుపు కోసం విశాఖ షిఫ్ట్ అవడం పెద్ద కష్టమేమీ కాదు కదా?

2. గత ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయలేదని సిఎం జగన్‌ ఆరోపించారు. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తవుతోంది కదా. మరి ఇంతకాలం జిల్లాని ఎందుకు అభివృద్ధి చేయలేదు? తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడేసమయానికి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తుంటే, ఏపీలో జగన్ ప్రభుత్వం తాపీగా ఇప్పుడు శంకుస్థాపన చేస్తుండటం గమనార్హం. నాలుగు పోర్టులతో వేలు, లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది లభిస్తాయని చెపుతున్నప్పుడు ఇదే పని అధికారంలోకి రాగానే చేయొచ్చు కదా? కానీ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత శిలాఫలకాలు వేస్తున్నారంటే అవి ఎన్నికల కోసమే అని అనుకోవచ్చు కదా?ఇంతకీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చి పడిపోయిన రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో ఆరేడు లక్షల మందికి ఉద్యోగాల కధ ఏమైందో? ఇప్పుడు ఆ కధలేవీ వినిపించట్లేదే?

అయినా అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అని నొక్కి చెపుతున్నప్పుడు హటాత్తుగా ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం దేనికి? అంటే సంక్షేమ పధకాలతో ఓట్లు రాలవని గ్రహించారనుకోవాలా లేక ఈ శంకుస్థాపనలతో ప్రజలను మభ్యపెట్టవచ్చని భావిస్తున్నాట్లా?