AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఓ పక్క సీబీఐ విచారణ జరుపుతోంది. మరోపక్క పిటిషన్లు పడుతుంటే వాటిపై హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. ఈ కేసులో నిందితులు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు.

ఇవి సరిపోవన్నట్లు, మళ్ళీ వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ నిరపరాధులని ముందే తీర్పు ప్రకటించి సమాంతర విచారణ జరుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా దాన్ని ఫాలో అయిపోతోంది.

చివరికి వివేకా హత్యలో పాల్గొన్న డ్రైవర్ దస్తగిరి కూడా నిన్న మీడియా ముందుకు వచ్చి తన వాదనలు వినిపించాడు.

ఈ హత్య గురించి తాను 2021 నవంబర్‌లోనే ప్రొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చానని, అప్పుడు తన వాదనలను ఖండించని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఇప్పుడు ఎందుకు ఖండిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సిట్‌ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి రెండో పెళ్ళి, వివాహేతర సంబంధాలు, ఆస్తి కోసం హత్య, వివేకా ల్యాండ్ సెటిల్‌మెంట్స్ వంటివన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకొని విచారించలేదని ప్రశ్నించాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి రోజుకో పిటిషన్‌ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాడు. వివేకాను గొడ్డలితో నరికి చంపిన తర్వాత తాను వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్‌కు వెళ్ళి అక్కడ చొక్కాపై రక్తపు మరకలను శుభ్రం చేసుకొన్నానని చెప్పాడు. ఆ తర్వాత హాస్పిటల్‌ సిబ్బంది వచ్చి వివేకా మృతదేహానికి బ్యాండేజీలు కట్టిన మాట వాస్తవమా కాదా?అని దస్తగిరి ప్రశ్నించాడు.

హైకోర్టులో విచారించవలసిన ఇటువంటి విషయాలన్నిటినీ వివేకా హంతకులే మీడియాతో చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వివేకాది ఖచ్చితంగా రాజకీయ హత్యే అని దస్తాగిరి తీర్పు చెప్పేశాడు. అయితే అతను చేస్తున్న పని ఏమిటి?అతను ఈ విషయాలన్నీ మీడియాకి ఎందుకు చెపుతున్నాడు?ఈవిదంగా మాట్లాడటం ద్వారా కేసు విచారణను ప్రభావితం చేయాలనుకొంటున్నాడా లేక బలహీన పరచాలనుకొంటున్నాడా?అనే సందేహం కలుగుతుంది.

ఈ హత్య కేసులో హంతకులు ఎవరో, వారి వెనుక ఉన్నవారెవరో సీబీఐ కనుగొనాల్సి ఉంది. వారిని న్యాయస్థానం ధోషులుగా నిర్దారించాల్సి ఉంది. కానీ ఈ కేసులో నిందితులే ఫలానా ఫలానావారు హంతకులని చెపుతుండటం చాలా విచిత్రంగా ఉంది. ఇది ఇలాగే సాగితే ఈ కేసు విచారణ పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ కేసుతో సంబందం ఉన్న నిందితులను హైకోర్టు నియమిత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది.