జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రయత్నిస్తానని అందుకోసం టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దమని కూడా ప్రకటించారు.
అయితే ఇటీవల ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన తర్వాత ఏపీలో బిజెపితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పవన్ పొడ అంటే గిట్టని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా సై అన్నారు.
మళ్ళీ ఎప్పటిలాగే రెండు పార్టీలు సైలెంట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తాపీగా సినిమాలు చేసుకొంటుండగా, జనసేన, బిజెపిలు దేనిదారి దానిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కనుక జనసేన-బిజెపితో కలిసి ఉంటుందా లేక టిడిపితో కలుస్తుందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పనిచేయాలనుకొంటున్నారని కానీ ఢిల్లీ పెద్దలు ఆయనను భయపెట్టి అడ్డుకొంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి, జనసేన పార్టీల మద్య బిజెపి సైంధవుడిలా అడ్డుపడుతోందని పితాని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్‌ని భయపెట్టి బిజెపితో కొనసాగేలా చేసుకోవడం ఎంతోకాలం సాధ్యం కాదన్నారు.
పొత్తుల విషయంలో వామపక్షాలు పూర్తి స్పష్టతతో ఉన్నాయి కానీ బిజెపి మాత్రం డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఏపీలో బిజెపి చాలా తప్పుడు రాజకీయాలు చేస్తోందని పితాని అన్నారు. ఇక్కడ ఏపీలో బిజెపి ప్రతిపక్షంలా నటిస్తుంటుందని కానీ ఢిల్లీలో బిజెపి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటుందని పితాని సత్యనారాయణ అన్నారు. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఇన్ని డ్రామాలు ఆడుతున్నా కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఇప్పటికే బిజెపి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో సహా దేశప్రజలు కూడా విసుగెత్తిపోయున్నారని కనుక రాబోయే రోజుల్లో బిజెపి కేంద్రంలో కూడా అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదని పితాని సత్యనారాయణ అన్నారు.
ఏపీలో బిజెపి తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది తప్ప రాష్ట్రం సర్వనాశనమైపోతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు కూడా తీవ్ర అసహనంగానే ఉన్నారు. పైగా ఆంద్రుల సెంటిమెంట్‌తో ముడిపడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మిపడేస్తామని కేంద్ర ప్రభుత్వం చాలా నిర్మొహమాటంగా చెపుతోంది. ప్రత్యేకహోదా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈవిదంగానే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడినా సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది.
కనుక బిజెపితో కలిసి పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. బిజెపితో కలిసి సాగితే కేంద్రం సహాయసహకారాలు లభిస్తాయేమో కానీ ప్రజల దృష్టిలో పవన్ కళ్యాణ్ చులకన అవుతారు. జనసేన కూడా రాజకీయంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక పవన్ కళ్యాణ్ కేంద్రం ఒత్తిళ్ళని తట్టుకొని బిజెపికి కటీఫ్ చెప్పి టిడిపితో కలుస్తారా లేదో చూడాలి.