AP

జగనన్న వసతి దీవెన… తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ

ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ… 8,61,138 తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం.

చదువు కుటుంబ చరిత్రను మారుస్తుంది.
మన పిల్లల చదువులకి సంబంధించిన కార్యక్రమం ఇది. చదువు ఒక మనిషిని ఎంత గొప్పగా మారుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబాలకు సంబంధించిన సామాజిక వర్గాన్నే మారుస్తుంది. కులాల చరిత్రను మారుస్తుంది. పేదరికపు సంకెళ్లను తెంచుకోవాలంటే అది కేవలం చదువు అనే ఒకేఒక్క అస్త్రంతో సాధ్యమవుతుంది. చదువు జీవితాలను మారుస్తుందని గట్టిన నమ్మని ప్రభుత్వంగా ఈ నాలుగు సంవత్సరాలు ప్రతి అడుగు పిల్లలకోసమే వేశాం.

మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని..
రాబోయే తరాలు ప్రపంచంతో పోటీపడాలి, రాబోయే తరాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే కచ్చితంగా వాళ్లంతా గొప్పగా చదవాలి. చదువులు కోసం ఎవరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేశాం.
చదువు అంటే మొక్కుబడిగా చదివించామన్నట్టు కాకుండా.. ఆ చదువులు వల్ల జీవితాలు బాగుపడాలి అని ఈ రంగంలో మార్పులు తీసుకువస్తూ అడుగులు వేశాం. నాణ్యమైన చదువు ప్రతి ఊరులోనూ, ప్రతి జిల్లాలోనూ తీసుకునిరావాలని వేగంగా అడుగులు వేశాం.ఈ నాలుగేళ్లలో అలాంటి నాణ్యమైన చదువులు, విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు తీసుకునివచ్చాం.

తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే…
ఇవాళ జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ఒక్కటే సరిపోదు దానికి తోడుగా…. జగనన్న వసతి దీనెన కూడా ఉంటేనే పిల్లలకు ఇంకా మంచి జరుగుతుంది, పిల్లలు చదువుకునేదానికి ఏ ఒక్కరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదన్న తపన, తాపత్రయంతో జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం.
పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెనే కాకుండా… ఒకవైపు పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే.. మరోవైపు పిల్లలు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌కు ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశంతో ఈ రోజు సుమారు రూ.913 కోట్లు బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

ఐటీఐ చదువుతున్న పిల్లలకు, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లలందరికీ ఈ వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. ఐటీఐ పిల్లలకు ఏడాదికి రూ.10వేల చొప్పున, పాలిటెక్నిక్‌ పిల్లలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లలకు రూ.20 వేలు ఏడాదికి ఆర్ధిక సహాయం అందిస్తూ.. తల్లుల ఖాతాల్లో జమ చేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతిదీవెన. ఇవాళ 9.55 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ 8.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.913 కోట్లు జమ చేస్తున్నాం.