ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఆది పురుష్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకోగా, సినిమాకు ఊహించని షాక్ తగులుతోంది.
జూన్ 16 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని భావిస్తే అందుకు భిన్నంగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఆది పురుష్ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీశారు అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సినిమాలో రామాయణం లోని పాత్రల కు విరుద్ధంగా ప్రధాన పాత్రలను అనుచిత రీతిలో తెరకెక్కించారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వెల్లడించారు. తులసి దాస్, వాల్మీకి వంటి వారు రచించిన రామాయణంలోని పాత్రలకు భిన్నంగా సినిమాలో పాత్రలు ఉన్నాయని, సినిమాల్లో దేవతా మూర్తుల వర్ణన సరైన రీతిలో లేదని, హిందూ బ్రాహ్మణుడైన రావణ పాత్ర ధారి గడ్డంతో కనిపించటం అభ్యంతరకరంగా ఉందని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
రావణుడికి సంబంధించిన అనేక సన్నివేశాలు వాస్తవాలకు దూరంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. దేవతామూర్తులకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దడం కానీ తొలగించటం కానీ చేయాలని, లేదంటే సినిమా ప్రదర్శనే ఆపివేయాలని తమ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.