AP

ముద్రగడను వైసీపీ నడిపించట్లేదు- పవన్ నే చంద్రబాబు ఆడిస్తున్నారు- సజ్జల కామెంట్స్.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ వర్సెస్ విపక్షాల మాటల యుద్ధం ముదురుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వారాహి టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఘాటు కౌంటర్లు ఇస్తోంది.

అయినా పవన్ మాత్రం మాటల యుద్ధం ఆపట్లేదు. దీంతో ఓవైపు పవన్ ను చంద్రబాబుతో కలిపి టార్గెట్ చేస్తూనే, మరోవైపు ముద్రగడను పవన్ పైకి ఉసిగొల్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ వైసీపీ నేత సజ్జల స్పందించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న విమర్శలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మరోసారి ఘాటుగా స్పందించారు. పవన్ పొలిటీషియన్ కాదు,పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. పవన్ చదివేది చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు. చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవని, చంద్రబాబు గతం లో ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదని సజ్జల గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.

కులాన్ని వాడుకోవడం, కులాలమద్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు లక్ష్యం ..దీనిని ప్రజలు హర్షించరని సజ్జల విమర్శించారు. పవన్ చేస్తున్న యాత్రద్వారా ముద్రగడను విమర్శించడం భావ్యం కాదన్నారు. ముద్రగడ అనుభవమున్న నేత,నిజాయితీపరుడు,కాపుల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి అని అందరికీ తెలుసన్నారు. ఆయన కులాన్ని ఏనాడూ వాడుకోలేదన్నారు. పవన్ లా కులాన్ని ఎక్కడో తాకట్టు పెట్టలేదన్నారు.

పవన్ కళ్యాణ్ ను నడిపిస్తోంది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు. అంతమాత్రానికి ముద్రగడ పద్మనాభాన్ని వెనుకనుండి వైఎస్ఆర్ సీపీ నడిపిస్తుందనుకుంటే ఎలా ? అని సజ్జల ప్రశ్నించారు. ముద్రగడ పవన్ పై చేస్తున్న లేఖల దాడితో ఆయన వెనుక వైసీపీ ఉందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సజ్జల వాటిని తిప్పికొట్టారు.