AP

నెల్లూరు అసెంబ్లీ బరిలో అనిల్ వర్సస్ ఆనం – బస్తీ మే సవాల్..!?

నెల్లూరులో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ మంత్రులు అనిల్ వర్సస్ ఆనం మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆనం టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

ఇదే సమయంలో ఆనం లక్ష్యంగా అనిల్ మాటల తూటాలు పేల్చుతున్నారు. దమ్ముంటే తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. తన రాజకీయం నెల్లూరులో ఆరంభమైందని..నెల్లూరులోనే ముగింపు కావాలనుకుంటున్నానంటూ ఆనం అసలు విషయం తేల్చేసారు.

ఆనంకు అనిల్ సవాల్ : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పై మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరు సార్లు గెలిచానని చెబుతున్న ఆనం..పార్టీ వేవ్ ఉన్నప్పుడే గెలిచారని చెప్పుకొచ్చారు. ధైర్యముంటే తనతో పోటీ చేయాలని సవాల్ చేసారు. సవాల్ స్వీకరిస్తారా..ఆత్మరూరు నుంచి పోటీ చేస్తారా తేల్చుకోవాలని డిమాండ్ చేసారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం సంబంధించి టిడిపి నేత సోమిరెడ్డి మాట్లాడారని..నెల్లూరు నగర అభివృద్ధికి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో లెక్క తీస్తాం..చర్చకు రావాలని పిలుపునిచ్చారు. రవిచంద్రకు ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదన్నారు. జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేతకు అయిదు పదాలు సరిగ్గా పలకలేరని అనిల్ ఎద్దేవా చేసారు.

ఆనం కీలక వ్యాఖ్యలు : ఈ వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే ఆనం స్పందించారు. టిడిపికి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారని..ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇంకా ఏడాది అధికారం ఉన్నా వద్దని బయటకు వచ్చామని వివరించారు. మొదట ఆ ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి..తర్వాత తమను అడగాలని వ్యాఖ్యానించారు. తాను గతంలో నెల్లూరు.. రాపూరు.. ఆత్మకూరు.. వెంకటగిరి ల నుంచి పోటీ చేశానని ఆనం గుర్తు చేసారు. ఆరు సారు ఎమ్మెల్యేగా గెలిచానని ..కొన్నిసార్లు ఓడిపోయాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.