AP

ఏపీలోని గండికోటను తెలంగాణకు ఎత్తుకుపోయారు..!!

హైదరాబాద్/కడప: గండికోట.. గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరున్న చారిత్రాత్మక ప్రదేశం. ఏపీలోని ప్రఖ్యాత పర్యాటక స్థలాల్లో ఒకటి. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో..

పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. సుమారు 300 అడుగుల ఎత్తున ఉండే కొండలను చీల్చుకుంటూ పెన్ననది ప్రవహిస్తుంటుంది. అందుకే దీనికి గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

ఈ గండికోట.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్లుగా చిత్రీకరించారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఉద్దేశపూరకమా? లేక పొరపాటా? అనేది తెలియట్లేదు గానీ.. గండికోటను తెలంగాణలో ఉన్నట్లుగా ఓ వీడియోను చిత్రీకరించారు. దీన్ని స్వయానా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. గండికోటను తెలంగాణకు ఎప్పుడు ఎత్తుకుపోయారనే కామెంట్స్ పడుతున్నాయి.

ఇటీవలే జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్ ఇంటికి వెళ్లారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్‌ను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ తొమ్మిది సంవత్సరాల పరి పాలన, అభివృద్ధికి సంబంధించిన కొన్ని పుస్తకాలు అందజేశారు. నాగర్ కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

జేపీ నడ్డా పర్యటనకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్‌తో కూడిన వీడియోను తెలంగాణ బీజేపీ నాయకులు చిత్రీకరించారు. 2 నిమిషాల 48 సెకెండ్ల నిడివి ఉండే వీడియో ఇది. ఈ వీడియో ఇంట్రడక్షన్‌లోనే గండికోటను చూపించారు. దీనిపై తెలంగాణ అనే అక్షరాలను ముద్రించారు. అనంతరం జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో ల్యాండ్ కావడం, బీజేపీ నాయకులు ఆయనను రిసీవ్ చేసుకోవడం కనిపిస్తుంది.

ఈ వీడియోతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదు. జేపీ నడ్డా పర్యటన పూర్తిగా తెలంగాణకు సంబంధించినదే. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన తెలంగాణలో పర్యటించారు. దీనికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ- ఏపీలో ఉన్న గండికోటను తెలంగాణలో ఉన్నట్లుగా చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. జేపీ నడ్డా ట్రోల్‌కు గురవుతున్నారు.