జనసేన (Janasena)వర్సెస్ వైసీపీ(YCP) మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బహిరంగ సభల్లోనూ..సోషల్ మీడియా(Social Media)లోనూ ఒక పార్టీ అధ్యక్షుడ్ని మరో పార్టీ అధ్యక్షుడు విమర్శించుకుంటున్నారు.
ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతున్నారు. నరసాపురం సభలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఉద్వేగంగా ప్రసంగించడాన్ని సీఎం జగన్ (YS Jagan)తప్పు పట్టారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలు చేశారు. చివరకు వారాహి వాహనాన్ని వరాహి అని ఉచ్చరించారు. దీనిపై జనసైనికులు, పవన్ కల్యాణ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రికి తెలుగు సరిగ్గా పలకడం రాదు. తెలుగు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు చిన్నప్పుడు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే వారాహికి, వరహికి తేడా తెలియకుండా మాట్లాడారు. తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు ఉచ్ఛారణ సరిగా రాని నియంత, కంఠకుడు పాలనలో ఉన్నందుకు చింతిస్తున్నానంటూ పవన్ కల్యాణ్ బుధవారం భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బదులిచ్చారు. అంతే కాదుజనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వయోజన సంచార పాఠశాల పథకంలో భాగంగా ఈ ముఖ్యమంత్రికి తెలుగు పదాలు ఎలా పలకాలో నేనే నేర్పిస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. స్కూల్ విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో ఎలా మాట్లాడాలో ఈ ముఖ్యమంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమని కౌంటర్ ఇచ్చారు.