AP

టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు

భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. ఆ దేశ జాతీయ జట్టుతో మూడు చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోతోంది.

భారత్- బంగ్లాదేశ్ మధ్య మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ టీ20 మ్యాచ్‌తో ఆరంభం కానుంది.

తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభమౌతుంది. 22వ తేదీన ముగుస్తుంది. మ్యాచ్‌లన్నింటికీ మిర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఈ రెండు సిరీస్‌లల్లో బంగ్లాదేశ్‌తో తలపడే జట్టును ప్రకటించింది.

తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆ దేశ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమౌతుంది. 11, 13 తేదీల్లో మిగిలిన రెండు టీ20లు కూడా అదే సమయానికి, అదే స్టేడియంలో జరుగుతాయి. ఈ నెల 16వ తేదీన తొలి వన్డే మ్యాచ్ మిర్‌పూర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 19, 22 తేదీల్లో మిగిలిన రెండు వన్డేల్లో ఈ రెండు జట్లు తలపడతాయి.

బంగ్లాతో ఈ రెండు సిరీస్‌లను ఆడబోయే భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రెండింట్లోనూ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని వహిస్తారు. స్మృతి మంధాన వైస్ కేప్టెన్‌గా వ్యవహరిస్తారు. యాస్తికా భాటియా, ఉమా ఛెత్రీని వికెట్ కీపర్లుగా ఎంపిక చేసింది బీసీసీఐ.

ఈ జట్టులో ఏపీ నుంచి బారెడ్డి మల్లి అనూష ఎంపిక అయ్యారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా. ఆమెకు ఇదే తొలి ఇంటర్నేషనల్ సిరీస్. ఇప్పటివరకు ఆంధ్రా విమెన్స్ తరఫున లిస్ట్ ఏ మ్యాచ్‌లను ఆడారు. 2021లో క్రికెట్‌లో అడుగు పెట్టారు. ప్రధానంగా బౌలర్. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లల్లో 12 వికెట్లను పడగొట్టారు. ఇండియా- ఏ తరఫున హాంకాంగ్‌పై ఆడారు.

టీ20 టీమ్‌లో- హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధాన (వైస్ కేప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, ఎస్ మేఘన, పూజా వస్త్రకర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, మిన్ను మణి ఉన్నారు.

వన్డే టీమ్‌ కోసం- హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధాన (వైస్ కేప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవికా వైద్య, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, ప్రియా పునియా, పూజ వస్త్రకర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, మోనికా పటేల్, రాశి కనోజియా, అనూషా బారెడ్డి, స్నేహ రాణా సెలెక్ట్ అయ్యారు.