అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మరో ప్రాజెక్టు.. 108, 104 అంబులెన్సులు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులను తీర్చిదిద్దారు.
మారుతున్న కాలానికి, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
2020 జులైలో ఒకేసారి 1088 అంబులెన్సు వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఆ వెంటనే అవి నిర్దేశిత పట్టణాలు, గ్రామాలకు తరలి వెళ్లాయి. దీనితో అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టయింది.
ఇప్పుడు తాజాగా మరిన్ని 108 అంబులెన్సులు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటైంది. జెండా ఊపి కొత్త అంబులెన్సులను ప్రారంభిస్తారు.
వైద్య సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేని గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ అంబులెన్స్‌లను తీర్చిదిద్దింది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 108, 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లను చేసింది.
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించే సమయంలోనే అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్సను అందిస్తారు. దీనికి అవసరమైన సదుపాయాలన్నింటినీ ఇందులో కల్పించారు. వెంటిలేటర్లు, ఇన్‌ఫ్యూజన్, సిరంజి పంప్స్ వంటి పరికరాలను అమర్చారు. ఇదివరకు ఈ సౌకర్యం అంబులెన్స్‌ల్లో ఉండేది కాదు. బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్), అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్) వ్యవస్థ ఇందులో ఉంది.
చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరో 26 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు అప్పట్లో. బీఎల్‌ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఏఎల్‌ఎస్ అంబులెన్సుల్లో రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు.
నియో నాటల్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లు, వెంటిలేటర్లను అమర్చారు. గ్రామాల్లో సేవలను అందించడానికి ఉద్దేశించిన 104 అంబులెన్సులను మొబైల్ మెడికల్ యూనిట్‌గా తీర్చిదిద్దారు. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. మందులను ఉచితంగా అందజేస్తారు. ప్రతి అంబులెన్స్‌లో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్, జీపీఎస్‌తో అనుసంధానించి ఉంటాయి.