శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది.
అంజూయాదవ్ వివాదాస్పదంగా
పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార శైలి పైన పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా శ్రీకాళహస్తిలో సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్దం చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. ఆ సమయంలో జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలను స్టేషన్ కు తరలించే సమయంలో ఆ పార్టీ నాయకుడు కొట్టే సాయిని సీఐ అంజూయాదవ్ బహిరంగంగా రెండు చెంపల మీద కొట్టటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఐ వ్యవహార శైలిని నిరసిస్తూ పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఈ ఘనట పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పైన తీసుకున్న చర్చల వివరాలను ఈ నెల 27 లోగా ఇవ్వాలని ఆదేశించింది.
పవన్ కల్యాణ్ ఆగ్రహం
ఈ ఘటన పైన జనసేనాని పవన్ సీరియస్ అయ్యారు. జనసేన నేతలు..కార్యకర్తల పై చేయి పడితే తన పైన పడినట్లేనని చెప్పుకొచ్చారు. శ్రీకాళహస్తిలో తన పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎందుకు కొట్టారని నిలదీసారు. దీని పైన తానే తిరుపతికి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.
ఇందుకు సోమవారం జిల్లా ఎస్పీని కలిసేందుకు తిరుపతి రావాలని నిర్ణయించారు. జిల్లా ఎస్పీని కలిసి సీఐ అంజు యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరేందుకు పర్యటన ఖరారు అయింది. ఈ సమయంలనే జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికే ఈ ఘటన పైన డీఐజీకి నివేదిక సమర్పించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
చర్యలకు రంగం సిద్దం
ఈ నివేదిక ఆధారంగా సీఐ అంజు యాదవ్ కు ఛార్జ్ మెమో ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా క్రమశిక్షణా చర్యలు తీసుకొనేందుకు సిద్దమయ్యారని..ఈ రోజు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఐ అంజుయాదవ్ తీరు గతంలోనూ వివాదాస్పదమైంది.
హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మహిళపై అంజూయాదవ్ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు జనసేన నేత పైన వ్యవహరించిన తీరుతో మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి చర్య తీసుకుంటారనేది చూడాలి.