AP

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు.

అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది.

నేడు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి విశాఖ నుండి పాలన ప్రారంభం ఎప్పుడో చెప్తూ వ్యాఖ్యలు చేశారు . త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభమవుతుందని, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభం కాబోతుందని ఆయన తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో సీఎం విశాఖ నుండి పాలన సాగించేందుకు వస్తారని స్పష్టం చేశారు. న్యాయపరమైన అడ్డంకుల వల్ల కాస్త ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు .

 

అంతేకాదు వైసిపి సీనియర్ నాయకుడు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను దేశం మొత్తం ప్రశంసిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ సమావేశంలో వాలంటీర్లను అభినందించారన్నారు.

వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ సైతం కొనియాడారు అని, అవినీతికి తావు లేకుండా వాలంటీర్లు పనిచేస్తున్నారని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పైన వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి జన్మభూమి కమిటీలలాగా వాలంటీర్ల వ్యవస్థ దోపిడీలకు పాల్పడలేదు అన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ పై మా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధమని, అయితే వాలంటీర్ల పై అవగాహన లేకుండా పవన్, చంద్రబాబు మాట్లాడుతున్నారని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పైన పవన్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.