AP

వివేకా హత్య కేసులో ట్విస్ట్

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ట్విస్ట్. కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు.

అరెస్టులు, చార్జిషీట్లు, మధ్యలో ఓ సెక్షన్ అఫ్ మీడియా చేసిన హడావిడితో ఈ కేసు హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల తుది చార్జిషీట్ ను సిబిఐ న్యాయస్థానం ముందు ఉంచింది. ఈ కేసులో కీలక వాంగ్మూలాలను అందులో పొందుపరిచింది. అయితే తాను ఇవ్వని వాంగ్మూలాన్ని సిబిఐ పొందుపరిచినట్లు అజయ్ కల్లాం ఆరోపిస్తున్నారు.

2023 ఏప్రిల్ 9న సిబిఐ తన స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు అజయ్ కల్లాం చెబుతున్నారు. తాను చెప్పింది ఒకటైతే.. సిబిఐ దాన్ని మార్చి చార్జిషీట్లో మరో విధంగా పేర్కొందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసును ఎటువంటి వివక్ష, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని ఆకాంక్షించారు.

వివేకా హత్య జరిగిన రోజు జగన్ నివాసంలో ఏం జరిగిందో అజయ్ కల్లాం మరోసారి స్పష్టం చేశారు. ఆరోజు ఉదయం ఐదు గంటల సమయంలో జగన్ నివాసంలో మేనిఫెస్టో పై సమావేశం ప్రారంభమైనట్లు చెప్పారు. అక్కడకు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి తలుపు కొట్టారని… ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బయటకు వెళ్లారని… తిరిగి వచ్చి జగన్కు ఏదో విషయం చెప్పారని చెప్పుకొచ్చారు. వెంటనే షాక్ గురైనట్లు జగన్ నిలబడ్డారని.. చిన్నాన్న చనిపోయారని చెప్పారని అజయ్ కల్లాం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను సిబిఐకి చెప్పానని.. ఇంతకుమించి ఏమీ చెప్పలేదని అజయ్ కల్లాం చెబుతున్నారు. ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని సిబిఐ మార్చేసిందని ఆయన ఆరోపించారు. అందుకే తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వివరించారు. కల్లాం తాజా పిటిషన్ తో సిబిఐ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.