AP

ఏపీలో నా మద్దతు ఆ పార్టీకే- తేల్చేసిన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ..!

ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకీ, విపక్ష కూటమి ఎన్డీయేకూ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇద్దరూ ఎవరికి వారు ప్రజల్లో తమకే మద్దతుందని చెప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీగా సభలు ఏర్పాటు చేసి ప్రజామద్దతు ఉందని చెప్పుకుంటున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో చిన్నా చితకా నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఫైనల్ గా ఈసారి ఎన్నికల్లో విజయం కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకునేందుకు రెడీగా ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో ఒకప్పుడు అవినీతి రహిత రాజకీయాలకు మద్దతుగా నిలిచి సమాచార హక్కు చట్టం సహా పలు సంస్కరణలకు కారణమైన లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈసారి ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు జరుగుతున్న తీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈసారి ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చిచెప్పేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది.

 

ఏపీలో ఈసారి ఎన్నికల్లో తన మద్దతు ఎన్డీయే కూటమికేనని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ పరోక్షంగా తేల్చేశారు. ఇవాళ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఏపీ ఎన్నికలు జరుగుతున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందని జేపీ తెలిపారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అన్న సందేహం కలుగుతోందన్నారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటి మధ్య సమతూకం పాటించాలన్నారు. ప్రజలు తమ ఆర్ధిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్న వైసీపీకి ఓటేయొద్దని ఆయన పరోక్షంగా చెప్పేశారు. రాష్ట్రంలో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ పడుతున్నాయని, రెడ్లకూ, కమ్మ-కాపులకు మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోందన్నారు.

 

మంచి పాలన అంటే సంక్షేమం అనే ఓ పార్టీ భావిస్తోందన్నారు. అప్పులు తెచ్చి సగం జీతాలకు, మరికొంత కైంకర్యం చేసి, కొంత దుబారా చేసి మిగిలింది సంక్షేమానికి పెడుతున్నారన్నారు. ఎవరైనా సొంత డబ్బు ఇవ్వరు.. ప్రజల సొమ్ము అని మరచి తమ డబ్బుగా భావిస్తున్నారన్నారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే.. ఆ దేశం, ఆ రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయమన్నారు.

 

మనకి ఇప్పుడు నడుస్తుంటే కాదు, మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలని జేపీ కోరారు. ఎల్లకాలం పుచ్చుకోవడం కాదు.. ఎప్పుడూ సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. పేదరికం పోయే విధానం అమలు కాకపోతే ప్రజలే నష్టపోతారన్నారు. సంక్షేమం అంటేనే వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలన్నారు. అభివృద్ది అంటే దీర్ఘకాలికంగా సమాజంలో సంపద సృష్టి పెంచడమన్నారు. ఉపాధి , పెట్టుబడులు ప్రోత్సహించి పని చేసుకుంటూ ఎవరి కాళ్ల మీద వారు నిలబడటం అన్నారు.

 

ఏపీలో అభివృద్ధి, సంక్షేమానికి మధ్యే పోరాటం సాగుతోందన్నారు. కానీ కులమతాలు, ముఠాల ప్రస్తావనే ఎక్కువగా జరగడం విచారకరమని జేపీ తెలిపారు. ప్రజల భవిష్యత్తు కంటే కులాల చర్చే ఎక్కువగా ఉందన్నారు. ఏ తప్పు ఎత్తి చూపినా.. వెంటనే కులం, మతం, ప్రాంతం తెరపైకి తెస్తున్నారన్నారు. నేడు అధికారంలో ఎవరు ఉంటే వారు నియంతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్దతుగా ఉంటే పూల బాట, ప్రత్యర్ధిగా ఉంటే ముళ్ల మార్గంగా మారుస్తున్నారన్నారు.