మనకు ఎంతో కాలంగా అన్నం ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. మనం ఎక్కువగా తెల్లటి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
దీంతో చాలా మంది తెల్లబియ్యంతో వండిన అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. పొట్టు తీయని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్యకరమైనది మరియు దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్రౌన్ రైస్ ను రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ లో క్యాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్, బి కాంప్లెక్స్ విటమిన్స్ , ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
అధిక బరవు సమస్యతో బాధపడే వారు బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. మన ధ్యాస ఇతర చిరుతిళ్లకు మీదకు వెళ్లకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే బ్రౌన్ రైస్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి.
అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక బరువు, షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ను తీసుకోవడమే మంచిది. కానీ జీర్ణసంబంధిత సమస్యలు, తక్కువ జీర్ణశక్తి ఉన్నవారు మాత్రం బ్రౌన్ రైస్ ను తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల ఉబ్బరం, అతిసారం, మలబద్దకం వంటి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కనుక ఇటువంటి సమస్యలతో బాధపడే వారు రోజూ బ్రౌన్ రైస్ ను తీసుకోకపోవడమే మంచిది. అలాగే వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది.
ఆర్సెనిక్ ఎక్కువగా ఉండే ఈ బ్రౌన్ రైస్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, టైస్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కనుక బ్రౌన్ రైస్ ను వండేటప్పుడు ముందుగా బాగా శుభ్రం చేయాలి. తరువాత ఒక కప్పుకు ఆరు కప్పుల నీళ్లు చొప్పున పోసి గంజిని వార్చాలి. ఇలా చేయడం వల్ల ఆర్సెనిక్ ఎక్కువ మొత్తంలో తొలగిపోతుంది. ఈ విధంగా బ్రౌన్ రైస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తగిన మోతాదులో తగిన విధంగా తీసుకోవాలని అప్పుడే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందగలమని నిపుణులు చెబుతున్నారు.