AP

వైసీపీలో మరో బిగ్ వికెట్ అవుట్..: ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ రాజీనామా: ఏం జరుగుతోంది..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమంగా నెలకొంటోంది. ఇంకో నాలుగు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంపై దృష్టి సారించింది. 175కు 175 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పరిస్థితుల్లో- గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియెజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తన పదవితో పాటు పార్టీకీ గుడ్‌బై చెప్పారాయన. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.

 

YSRCPs Gajuwaka incharge Devan Reddy quit the Party

ఇది అక్కడితో ఆగలేదు. మరో బిగ్ వికెట్ పడింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి (Tippala Devan Reddy) రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తోన్నట్లు తెలిపారు.

 

సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కల్యాణ్‌నే మట్టి కరిపించిన పేరును సాధించారు నాగిరెడ్డి. భారీ మెజారిటీతో పవన్‌ను ఓడించి, జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన కుమారుడు దేవన్ రెడ్డిని కోఆర్డినేటర్‌గా అపాయింట్ చేసింది వైసీపీ.

 

ఇప్పుడాయన రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం టికెట్‌ను యాదవ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తనకు గానీ, తన తండ్రికి గానీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.