TELANGANA

రేవంత్ మంత్రివర్గంలోకి మరో ఆరుగురు…

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ లో మరో ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్దంగా ఉన్నారు. జాబితా సిద్దం చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ కనిపిస్తోంది.

 

కేబినెట్ విస్తరణ : రేవంత్ తొలి మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం ఇచ్చారు. వారికి శాఖలు అప్పగించారు. కీలక శాఖలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. రేవంత్ ఇప్పటికే మరో ఆరుగురికి కేబినెట్ లో అవకాశం కల్పించేలా ప్రణాళికలతో సిద్దమయ్యారు. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఉన్నారు. అయితే, రేవంత్ మాత్రం తన టీంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు.

 

రేసులో ఉన్నదెవరు : ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన నిజామాబాద్ అర్బన్‌లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి.

హోం శాఖ దక్కేదెవరికి : గ్రేటర్ నుంచి మైనంపల్లి హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి సీతక్కకు అవకాశం ఇవ్వటంతో మరో బెర్తు కష్టమనే వాదన ఉంది. హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కే ఎక్కవ అవకాశాలు కనిపిస్తున్నాయి. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది చర్చ సాగుతోంది. హైదరాబాద్ నుంచి మంత్రి పదవి ఖరారు..శాఖల కేటాయింపు ఇప్పుడు కీలకంగా మారుతోంది.