AP

టీడీపీ తొలి జాబితా సిద్దం…

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీ-జనసేన పొత్తు వేళ అభ్యర్దుల పైన స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన నుంచి 50 అసెంబ్లీ -5 లోక్ సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 30 అసెంబ్లీ -2 లోక్ సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ నుంచి 45 మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

చంద్రబాబు కసరత్తు: ఏపీలో ఎన్నికలు ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబుకు నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేసారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు వేళ..ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్ఫష్టత రావటం లేదు.

బీజేపీ వైఖరి పైన వచ్చే వారం స్పష్టత తీసుకొనే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్దుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు – పవన్ నిర్ణయించారు. అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాల పైన చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు.

 

కొత్త ఎత్తుగడలు – ఎంపికలు: పవన్ కల్యాణ్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ బలం పైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్ల త్యాగానికి సిద్దం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇంఛార్జ్ లకు సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని..తరువాత సుమచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.

 

ఇక…ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్దుల తొలి జాబితా ప్రకటనకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. వైసీపీ ఖరారు చేసే సీట్లు..తమ పార్టీలో ఇబ్బంది లేనివి…అదే విధంగా జనసేన నుంచి అభ్యంతరం లేని 45 స్థానాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాల్లో అభ్యర్దులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్దం చేస్తున్నారు.

 

తొలి జాబితా సిద్దం: ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా మరో 27 స్థానాలకు అభ్యర్దులు ఖరారయ్యారు. గోదావరి జిల్లాల్లోని పిఠాపురం, భీమవరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, నర్సాపురం, ఆళ్లగడ్డ, తెనాలి, గాజువాక, తిరుపతి, కైకలూరు, అమలాపురం, రాజోలు, శ్రీకాకుళం, భీమిలి స్థానాలు జనసేనకు ఇప్పటికే ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిన స్థానాలపైన సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

 

రెండు పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్దుల జాబితాలను ఒకే సారి ప్రకటించటం ద్వారా ఎన్నికలకు ముందుగానే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో.. ఈ నెల 20న లోకేశ్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు – పవన్ పాల్గొంటున్నారు. ఆ సభా వేదికగా కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.