AP

Jr Ntr నట విశ్వరూపం.. మరువలేని ప్రభంజనం.. ‘సింహాద్రి’

బాక్సాఫీస్ రేంజ్, కమర్షియల్ పొటెన్షియాలిటీ, బాడీ లాంగ్వేజ్, వీరోచిత పోరాటం, భావోద్వేగం, నటన, మాస్.. వీటన్నింటినీ ఒక్క సినిమాలో ఉంటే ప్రేక్షకులకి మంచి విందు భోజనమే.

అలాంటి షడ్రుచులను జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తే.. ఆ సినిమానే ‘సింహాద్రి’. ఎన్టీఆర్ కెరీర్లో ల్యాండ్ మార్క్. టాలీవుడ్లో ఆదితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. సింహాద్రితో తనకంటూ ఓ ప్లేస్ సెట్ చేసుకున్నాడు. ఓ సినిమాపై ఉన్న భారీ అంచనాలు నిజమై.. బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమాల్లో సింహాద్రి కూడా ఒకటి. స్టూడెంట్ నెంబర్ వన్ తో ఎన్టీఆర్ ను చూసిన రాజమౌళి తన ఈ హై ఎండ్ యాక్షన్ మూవీకి ఎన్టీఆర్ కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్సై తీసిన సినిమా టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు వేదికైంది.

కెరీర్ ల్యాండ్ మార్క్..

ఈ సినిమా ఎన్టీఆర్ కే కాదు.. నందమూరి అభిమానులకు కూడా ఓ మెమరబుల్ స్టోన్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత బాగా పండించాడో.. యాక్షన్ సన్నివేశాల్లో ఉగ్ర రూపమే చూపాడు. సింగమలై.. అంటూ కత్తి పట్టిన ఎన్టీఆర్ ఊచకోతకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. నందమూరి కుటుంబం మూడో తరం ఎన్టీఆర్ రూపంలో అభిమానులకు ఓ ఆశాదీపం అయ్యాడు. పాటల్లో చీమ, చీమ పాటలో వయోలిన్ స్టెప్, నువ్వు విజిలేస్తే.. పాటకు లుంగీ కట్టిన మాస్ ఫ్యాన్స్ ను కుర్చీల్లో నిలువనివ్వలేదు. కేరళ బ్యాక్ డ్రాప్, ఇంటర్వెల్ సీన్లు సినిమాకు హైలైట్. ఈ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపమే చూపించాడని చెప్పాలి. అప్పటికి రాజమౌళి ఓ కమర్షియల్ ఫిల్మ్ మేకర్. ప్రస్తుతం ఫ్యాంటసీ కథలతో ఎంతటి మాయాజాలం చేస్తున్నాడో.. కమర్షియల్ డైరక్టర్ గా తన రేంజ్ ఏంటో చూపిన సినిమా సింహాద్రి.

రికార్డుల హోరు..

అద్భుత విజయం సాధించిన సింహాద్రి 150 కేంద్రాల్లో 100, 55 కేంద్రాల్లో 175 రోజులు రన్ అవడం ఇప్పటికీ చెరగని రికార్డ్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్, ఇమేజ్ డబుల్ మార్జిన్ లో పెరిగిపోయింది. 20ఏళ్ల కుర్రాడు సృష్టించిన ప్రభంజనానికి పరిశ్రమవర్గాలు ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. ఈ సినిమా తర్వాత నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక రైలులో అభిమానులు వచ్చారు. దాదాపు 10లక్షల మంది వచ్చారని ఓ అంచనా. అంతటి సెన్సేషన్ సింహాద్రి ఇచ్చిన హైప్. ఎన్టీఆర్ 40వ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి రీ-రిలీజ్ ను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ప్రత్యేక షోలు పడుతున్నాయి. కొత్త సినిమాకు ప్రచారంలా బైక్ ర్యాలీలు, ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఇంతటి హిట్ రీ-రిలీజ్ అంటే ఆమాత్రం ఉండాలిగా..!