AP

పట్టువదలని విక్రం.. పట్టు సడలించని ప్రజ్ఞాన్.. ఇవి ఇస్రో తురుపు ముక్కలు

చంద్రయాన్_2 వైఫల్యం తర్వాత ఇస్రో చంద్రయాన్_3 ప్రయోగం చేపట్టింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇస్రో మీద అభినందనల జల్లు కురుస్తోంది.

అయితే ఈ ప్రయోగంలో ఇస్రో చాలా తెలివైన పని చేసింది. తన తురుపు ముక్కలుగా విక్రమ్, ప్రజ్ఞాన్ ను వాడుకుంది. అవి కూడా ఇస్రో చెప్పినట్టుగానే చేశాయి. గత వైఫల్యానికి తావు ఇవ్వకుండా విక్రమ్ పట్టు వదలకుండా తన పని తాను దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రజ్ఞాన్ కూడా విక్రమ్ లాగా పట్టు సడలకుండా చంద్రుడి మీదికి దిగింది.

సవాల్ గా తీసుకున్నారు

వాస్తవానికి నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్ _2 మిషన్ లో భాగంగా రోదసీలోకి దూసుకుపోయి 3.84 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి జాబిల్లిని ముద్దాడే క్రమంలో ఇస్రో ఓటమిపాలైంది. అయితే దీన్ని సవాల్ గా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్_3 లో పంపించిన ల్యాండర్ కు విక్రమ్ అని, రోవర్ కు ప్రజ్ఞాన్ అని అప్పటి పేర్లే పెట్టారు. పొరపాటు అనే మాటకు తావు ఇవ్వకుండా విక్రమ్, ప్రజ్ఞాన్ దర్జాగా తమ పని చేసుకుని పోయాయి. అమెరికా, చైనా, రష్యాకు సాధ్యం కాని పనిని సులువుగా చేసేసాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ గా లాండ్ ప్రక్రియను చేపట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. గతంలో అమెరికా, చైనా, రష్యా మాత్రమే తమ వ్యోమ నౌకలను సురక్షితంగా చంద్రుడి మీదకు దించాయి.

అనుక్షణం ఉత్కంఠ..

బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన ల్యాండింగ్ ప్రక్రియ ప్రతిక్షణం ఉత్కంఠగా సాగింది..ఆ సమయానికి ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 125 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి నుంచి శరవేగంగా కిందికి కదులుతూ వెళ్ళింది. అక్కడి నుంచి ల్యాండర్లోని వ్యవస్థలే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయి. దీనికి అనుగుణంగా అంతకుముందే “ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్” పనిచేయడం మొదలుపెట్టింది. ఈ దశలో శాస్త్రవేత్తల నియంత్రణ ఏదీ ఉండదు. 7.4 కిలోమీటర్ల ఎత్తు దాకా రఫ్ బ్రేకింగ్ దశ కొనసాగింది. ఈ ప్రక్రియ 11.5 నిమిషాల పాటు కొనసాగింది. చంద్రుడిని సమీపించే కొద్దీ, ల్యాండర్ వేగం తగ్గిస్తూ రావాలి. ఇందులో భాగంగా రెండు ఇంజన్లు ఆగిపోయాయి. మరో రెండు ఇంజన్లు మాత్రమే. ల్యాండర్ వేగం సెకనుకు 1,687 మీటర్ల నుంచి 358 మీటర్లకు తగ్గింది. 7.4 కిలోమీటర్ల నుంచి “ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్” మొదలయింది. అయితే చంద్రయాన్_2 ఈ దశలోనే విఫలమైంది. చంద్రయాన్_3 దీనిని విజయవంతంగా పూర్తి చేసింది. 1960,1970 దశకాల్లో ప్రయోగించిన అపోలో మిషన్ కంటే చంద్రయాన్_3 జాబిల్లిని చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టింది. అప్పట్లో అమెరికా ఉపయోగించిన రాకెట్ల కంటే భారత అత్యంత శక్తివంతమైన రాకెట్లను వినియోగించింది. దీంతో వ్యోమ నౌక చంద్రుడి దిశగా వెళ్లేందుకు భూమి చుట్టూ అనేక సార్లు పరిభ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత భూమి కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. తర్వాత కొన్ని నిమిషాలకే బెంగళూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు టచ్ లోకి వచ్చింది. చంద్రుడిపై కాలుపెట్టిన ప్రదేశం తొలి చిత్రాలను పంపింది.

నిర్ణీత షెడ్యూల్ ప్రకారం..

బుధవారం సాయంత్రం 5.47 నిమిషాల సమయంలో మొదలైన విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగింది. అప్పటిదాకా మిషన్ కంట్రోల్ సహాయంతో సాగిన విక్రమ్…”పవర్ డీసెంట్ ఫేజ్ మొదలు కాగానే ఆటోమేటెడ్ లాండింగ్ సీక్వెన్స్ మోడ్ ” లోకి వచ్చింది. అయితే ఆ క్షణం నుంచి ఈ నిర్ణయమయినా అది సొంతంగా తీసుకోవాల్సిందే.. మిషన్ కంట్రోల్ నుంచి ఎటువంటి సహాయం కూడా అందదు. పవర్ డీసెంట్ లో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి.. తొలి దశ అయిన రఫ్ బ్రేకింగ్ ఫేజ్ లో విక్రమ్ ల్యాండర్ హారిజంటల్ వేగం గంటకు ఆరు వేల కిలోమీటర్ల నుంచి అసలు సున్నాకు పడిపోయింది. ఆల్టిట్యూడ్ హోల్డ్ ఫేజ్ లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 7.42 కిలోమీటర్ల ఎత్తున నిలిచి సమాంతర స్థితి నుంచి నిలువుగా ఉంటే స్థితిలోకి రావడానికి 50 డిగ్రీల మేర వంగింది. 175 సెకండ్ల పాటు సాగిన మూడవ దశ ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ లో లాండర్ దాదాపుగా 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆ సమయంలో అది చంద్రుడి ఉపరితలానికి 800 నుంచి 1000 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. నాలుగోది టెర్మినల్ డీసెంట్ ఫేజ్.. ఈ దశలో ఫ్రీ ఫాల్ అయిన ల్యాండర్ విక్రమ్ కాళ్ళు చంద్రుడి మీద నెమ్మదిగా దిగాయి.