AP

జగన్ ఓ పూజారి.. దుమారం రేపుతోన్న ధర్మాన మాటలు

సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు మరీ విచిత్రంగా ఉంటాయి. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.. పనసకాయ నుంచి తొనలు వలచినట్టుగా ఆయన వ్యాఖ్యానాలు సాగుతాయి.

ఎలాంటి మాటలతోనైనా మడత పేచీ పెట్టగల సమర్ధుడాయన. 100 సూట్ కేస్ కంపెనీలు పెట్టి రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని జగన్ పై ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం అదే జగన్ పంచన చేరారు. అందుకే ధర్మాన మాటలకు అర్ధాలే వేరులే అని సిక్కోలు ప్రజలు లైట్ తీసుకుంటారు.అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బేలతనాన్ని చూపిస్తున్నాయి. ప్రజల్లో పలుచన చేస్తున్నాయి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను పూజారితో పోల్చారు. మంచోళ్లే కావాలంటే గుడిలో పూజారిని ఎన్నుకోవాలని సలహా ఇచ్చారు.మన మంచి కోసం పూజారి దేవుడిని కోరుతాడని.. ఇప్పుడు మన స్థితిగతులను మార్చుతున్న జగన్ కూడా ఆస్థానంలోనే ఉన్నారని గుర్తు చేస్తూ ధర్మాన వ్యాఖ్యానించారు. అందుకే మరోసారి జగన్ గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పెరుగుతున్న ధరలపై కూడా ధర్మాన విచిత్రంగా విశ్లేషించారు. ధరలు ఎక్కడ పెరగడం లేదని తిరిగి ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఒడిస్సా తదిత రాష్ట్రాల్లో కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ధర్మాన కామెంట్స్ స్థానిక ప్రజలకు చికాకు తెప్పించాయి. రాజకీయాల కోసం ఇంతలా దిగజారిపోతారా అని ఎక్కువ మంది ప్రశ్నించడం కనిపించింది. అటు వైసీపీ శ్రేణులు సైతం ధర్మాన వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తున్నాయి. చిలక పలుకు మాటలు చికాకు తెప్పిస్తున్నాయి.

అయితే శ్రీకాకుళంలో ధర్మాన మీటింగ్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఏదేదో చెబుతారు.. ఏదేదో మాట్లాడుతారు అంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది ముఖం మీద చెప్పేస్తున్నారు. మొన్న ఆ మధ్య ఓ మహిళ కు ఏ పార్టీకి ఓటు వేస్తావమ్మా అని ధర్మాన అడిగారు. ఆమె సైకిల్ గుర్తుకు ఓటు వేస్తానని చెప్పడంతో ముఖం మార్చుకున్నారు. అంతకు ముందు సైతం ధర్మాన మీటింగుల నుంచి మహిళలు స్వచ్ఛందంగా వెళ్లిపోవడం కనిపించింది. అయినా సరే ధర్మాన తన బుడిబుడి మాటలు విడిచి పెట్టడం లేదు. అతి తెలివితో మాట్లాడి ప్రజల మధ్యన చులకన అవుతున్నారు.