AP

హాట్ కేకులా విశాఖ ఎంపీ స్థానం.. మరీ ఇంత పోటీనా?

ఏపీలో ఇప్పుడు విశాఖ పార్లమెంట్ స్థానం హాట్ కేక్ లా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి నేతలు క్యూ కడుతున్నారు.

అన్ని పార్టీల నుంచి ఆశావాహులు అధికంగా ఉన్నారు. అయితే ఇందులో వలస పక్షులే అధికం. ఆది నుంచి విశాఖ లోక్సభ స్థానం నుంచి స్థానికేతర నాయకులే పోటీ చేస్తూ వచ్చారు.దీంతో స్థానికులకే అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రతి ఎన్నికల్లో స్థానికత అంశం వెలుగు చూస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరికి వారు టికెట్ల కోసం అధినాయకత్వాలపై ఒత్తిడి పెంచుతున్నారు.

గత ఎన్నికల్లో ఎంవీఎస్ సత్యనారాయణ ఎంపీగా గెలుపొందారు. మరోసారి విశాఖ నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నారు. వైసిపి నాయకత్వం కూడా సానుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా విజయసాయి రెడ్డి అల్లుడు తెరపైకి వచ్చినట్లు సమాచారం. తొలుత విజయ్ సాయి అనుకున్నా.. ఇప్పుడు అల్లుడు పేరు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా విశాఖలో పట్టు బిగించేందుకు విజయ్ సాయి రెడ్డి ప్రయత్నిస్తూ వచ్చారు. అది అల్లుడు కోసమేనని టాక్ వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ఎంపీగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓటమి చవిచూశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే మరోసారి బరిలో దిగుతారని టాక్ నడుస్తోంది. ఆయన అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా అంత ఈజీ కాదన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ అల్లుడు కావడం, లోకేష్ కు తోడల్లుడు కావడంతో పార్టీలో మరో అధికార కేంద్రంగా మారతారని అధినాయకత్వం భావిస్తోంది. అందుకే మరోసారి శ్రీ భరత్ ను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ నుంచి కూడా పోటీ తీవ్రంగా ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు నేతలు సైతం పావులు కదుపుతున్నారు. విశాఖలో స్థిర నివాసం సైతం ఏర్పాటు చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా జీవీఎల్ ఇక్కడే మకాం వేశారు. టిడిపి, జనసేనతో పొత్తు ఉంటే విశాఖ ఎంపీ స్థానాన్ని ఇట్టే కైవసం చేసుకోవచ్చని బిజెపి నేతల ఆలోచన. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో తన వైపే హై కమాండ్ మొగ్గు చూపుతుందని పురందేశ్వరి భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో టికెట్ సాధిస్తానని జివిఎల్ ధీమాగా ఉన్నారు.

అటు జనసేన సైతం పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంటు స్థానాన్ని అడుగుతోందని టాక్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎంపీగా పోటీ చేస్తారని.. కేంద్ర మంత్రిగా పదవి తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆశావహుడిగా ఉన్నారని టాక్ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన జేడీ లక్ష్మీనారాయణకు రెండున్నర లక్షల వరకు ఓట్లు వచ్చాయి. దీంతో జనసేన సైతం ఈ సీటు పై ఆశ పెట్టుకుంది. అటు జేడీ లక్ష్మీనారాయణ సైతం టికెట్ ఇచ్చే పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. లేకుంటే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగాలని చూస్తున్నారు. దీంతో ఎలా చూసినా విశాఖ ఎంపీ స్థానం హాట్ కేక్ లా మారినట్టే.