APNational

విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసులు ఆ సుపారీ గ్యాంగ్‌ను అర్థరాత్రి పట్టుకున్నారు.

న్యూకాలనీ లక్ష్మీరాయల్ హొటల్‌లో రూమ్ నంబర్ 105లో ఆ ముఠా ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఓ ప్లాన్‌తో రంగంలోకి దిగి, నిందితులకు అనుమానం రాకుండా హోటల్‌లో ఎంట్రీ ఇచ్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురి సభ్యులు ఉండగా.. వారిని అరెస్ట్ చేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లు బస చేసిన రూమ్‌ని తనిఖీ చేయగా.. రెండు తుపాకులతో పాటు పొడవాటి కత్తులు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్రీధర్ పాతంగి (24), ఆదేశ్ పవచ (19), కైలాష్ గణేష్ పవర్ (30), విజయ్ పవర్ (21), అజయ్ చర్వాసి (25), పరుశురాం విబ్బేడి (58) అనే ఆరుగురు అనుమానితులు ఉన్నారు. విశాఖపట్నంలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు సుపారీ తీసుకొని, ఈ నిందితులు విశాకకు వచ్చినట్లు తెలిసింది. ఈ మహారాష్ట్ర గ్యాంగ్ పోలీసులకు తెలిపారు. అయితే.. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? వీరికి సుపారీ ఇచ్చిందెవరు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రైమ్ డీసీపీ నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సుపారీ తీసుకోవడం, దారుణాలకు పాల్పడి పారిపోవడమే ఈ ముఠా చేస్తుంటుందని పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఇంకా ఇతర సభ్యులు ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.